ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు స్వల్ప అస్వస్థత

నిర్మల్‌ : మంత్రి అల్లోల ఇంద్రకరన్‌రెడ్డి, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌లతో కలిసి ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ నిర్మల్‌ జిల్లాలోని మామడ మండలం పొన్కల్‌ వద్ద సదర్మాట్‌ బ్యారేజీ, ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం చనకా-కొరటా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ రెండు జిల్లాల్లో హెలిక్యాప్టర్‌ ద్వారా విహంగ వీక్షణం చేసి నిర్మల్‌లోని అటవీశాఖ అతిథిగృహానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ఒక్కసారి కళ్లు తిరగడంతో నీరసించి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు వచ్చి ఆమెకు వైద్య పరీక్షలు చేశారు. ఎలాంటి ప్రమాదం లేదని, కాసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు స్పష్టం చేశారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత జిల్లా పాలనాప్రాంగణంలో నిర్వహించిన సాగునీటి, మిషన్‌ భగీరథ పథకం పనుల ప్రగతి సమీక్షకు హాజరయ్యారు.