పోషకాలు లేని ఆహారంతో గిరిజనులు రక్తహీనత బారిన పడుతున్నారు. వారి అభివృద్ధికి మంజూరు చేస్తున్న నిధులు నిరుపయోగంగా మారుతున్నాయి. అర్హులకు పథకాలు క్షేత్రస్థాయిలో అందడం లేదు. అధికారులు ఏటా ప్రగతి నివేదికలిస్తున్నారే కానీ ఫలాలు అందక అడవి బిడ్డలు వెనుకబడుతున్నారు. చివరికి అనారోగ్యంతో అల్లాడుతున్నారు.
కర్నూలు: కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఆదిమ గిరిజనులైన చెంచుల అభివృద్ధికి 1975-76లో హైదరాబాద్ కేంద్రంగా ఐటీడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 1988లో హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి తరలించి వారి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మూడు జిల్లాల్లో కలిపి 165 మండలాల్లో 171 చెంచు గూడేల్లో సుమారు 27,857 మంది చెంచులు జీవిస్తున్నారు.
ఐటీడీఏ పరిధిలో జిల్లాలో పౌష్టికాహార బుట్టలు ఇచ్చిన వివరాలు
*గిరిజనుల కార్డులు 3,329
*మార్చి 682
*ఏప్రిల్ 181
*మే 465
*జులై 992
ఆగిన పౌష్టికాహారం
గిరిజనులకు పౌష్టికాహారం కరవైంది. పోషక పదార్థాలు అందించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం రూ.549 విలువగల ఆరు రకాల సరకులను ఫుడ్ బాస్కెట్ (ఆహార బుట్ట) పేరుతో ఉచితంగా అందించింది. ఈ మూడు జిల్లాల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్న 9 మండలాలను అధికారులు గుర్తించారు. అందులో కర్నూలు జిల్లాలో శ్రీశైలం, ఆత్మకూరు, కొత్తపల్లి మండలాలను ఎంపిక చేశారు. పథకాన్ని ఈ ఏడాది మార్చిలో ప్రారంభించగా మే నుంచి ఆగిపోయింది. ఫలితంగా వేలాదిమంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రస్తుతం అందరికీ ఇస్తున్నట్లే నిత్యావసర సరకులు మాత్రమే గిరిజనులకు అందుతున్నాయి. కొన్ని గ్రామాలు నల్లమలకు సమీపంలో ఉండటంతో సిగ్నళ్లు లేక సర్వర్ పనిచేయక అరకొరగా సరకులు ఇస్తున్న పరిస్థితి.