రాష్ట్ర యోగా సంఘం అధ్యక్షుడిగా నరసింహారావు

విజయవాడ : రాష్ట్ర యోగా సంఘం అధ్యక్షుడిగా నగరానికి చెందిన పరుచూరి నరసింహారావు ఎంపికయ్యారు. ఈ నెల 14న కాకినాడలో నిర్వహించిన రాష్ట్ర యోగా సంఘం సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నట్లు రాష్ట్ర యోగా సంఘం మాజీ అధ్యక్షుడు వి.వి.రామారావు తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా నెల్లూరుకు చెందిన ఎస్‌.శ్రీనివాసులునాయుడు, కోశాధికారిగా గుంటూరుకు చెందిన ఎ.అప్పారావు, గౌరవాధ్యక్షుడిగా నగరానికి చెందిన వీవీ రామారావు ఎన్నికయ్యారన్నారు. వీరి పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు పరుచూరి నరసింహారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన యోగా విద్యను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో యోగాను ఒక సబ్జెక్టుగా ఉంచాలని కోరారు.