ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు చర్యలు


హబ్సిగూడ: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి వైద్యానికి ఆదరణ పెరిగిందని చెప్పారు. రామంతాపూర్‌ ప్రభుత్వ హోమియోపతి వైద్యకళాశాల 52వ వార్షికోత్సవాన్ని కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మంత్రి ఈటల రాజేందర్‌, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డా.వేణుగోపాలచారి, కేఎన్‌ఆర్‌ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డా.కరుణాకర్‌రెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మైహోం గ్రూపు ఛైర్మన్‌ డా.రామేశ్వర్‌రావు తదితరులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు హోమియో వైద్యంపై మరింత అవగాహన కలిగించాలన్నారు. వైద్యవిద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆయూష్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డా.అలుగు వర్షిణి, కార్పొరేటర్‌ బేతి స్వప్నరెడ్డి, ప్రిన్సిపల్‌ డా.లింగరాజు తదితరులు పాల్గొన్నారు.