గిద్దలూరు : జిల్లా వ్యాప్తంగా నవశకం సర్వే పూర్తయింది. అదే క్రమంలో ఆరోగ్యశ్రీ కార్డుల సర్వేను సచివాలయ గ్రామ/వార్డు వాలంటీర్లు చేపట్టారు. వివరాలన్నింటినీ వడపోసి ఆరోగ్యశ్రీ కార్డుల అర్హులు, అనర్హుల జాబితాను జిల్లా అధికారులు రూపొందించారు. మండల పరిషత్తు, పురపాలక సంఘాలకు ఆయా జాబితాలను సోమవారం అందజేశారు. వాటిని గ్రామ సచివాలయ ఉద్యోగులకు అందజేసి కార్యాలయ ఆవరణలో ప్రదర్శించాలని ఆదేశించారు. తదనుగుణంగానే జాబితాను సచివాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ఉంచారు. ఏవైనా అభ్యంతరాలుంటే ఈ నెల 26లోపు సిబ్బందికి తెలియజేయాల్సి ఉంది. అభ్యంతరాలను పరిశీలించి అర్హులుంటే వారిని జాబితాలో చేర్చేందుకు అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 9,90,913 తెల్లరేషన్ కార్డులుండగా- గతంలో వాటి ఆధారంగానే ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. ఇప్పటికే 9,70,680 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరైనట్లు సమాచారం. కొత్తగా మరో 5,200 కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేసినట్లు సమాచారం