ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతుల కల్పన

ఒంటిమిట్ట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టరు కేఎస్‌ జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఏకశిలానగరి కోదండరామాలయాన్ని ఆయన సందర్శించారు. తనిఖీ అధికారి ధనుంజయ ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సీతారామలక్ష్మణమూర్తులను దర్శించి పూజలు చేశారు. అనంతరం జవహర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పీహెచ్‌సీలను బలోపేతం చేస్తున్నాం. అవసరాన్ని బట్టి వైద్యులు, స్టాఫ్‌నర్సులను నియమించేందుకు కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు. ఒంటిమిట్టలో వైద్య సేవలు మరింత విస్తరించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. సిబ్బంది కొరత రాకుండా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. తహసీల్దారు పి.విజయకుమారి, డీఈ సూర్యచంద్రారెడ్డి, ఆర్‌ఐ వెంకటరమణ, వీఆర్వో పరాశరబాబు పాల్గొన్నారు