విశాఖపట్నం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలకు దశలవారీగా సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, దీనికి అనుగుణంగా అనువైన స్థలాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి ఆమె కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రైవేటు భవనాల్లో ఉన్న వాటికి పక్కా భవనాలు నిర్మిస్తామని, గ్రామాలకు దగ్గరలో ఉండే విధంగా స్థలాలు గుర్తించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని, తగినంత స్థాయిలో నిల్వలు ఉంచాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, కాలువల్లో పూడికలు ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. దోమల నిర్మూలన చర్యలు చేపట్టాలన్నారు.