కంటి వెలుగు శస్త్రచికిత్సలకు సై

19 సర్కారు ఆసుపత్రుల ఆధునికీకరణ



 హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో శుక్లాల శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించిన వారికి సర్కారు ఆసుపత్రుల్లో అందుకు తగ్గ ఏర్పాట్లను ప్రభుత్వం చేపడుతోంది. ఇందుకోసం సుమారు రూ.2 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 19 ప్రభుత్వ దవాఖానాల్లో శస్త్రచికిత్స గదులను ఆధునికకీరించింది. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో ఇటీవల నిర్దేశించిన అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కంటి చికిత్సలు చేయడానికి వీలుగా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించింది. ప్రభుత్వం 2018 ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమం ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. రాష్ట్రంలోని 9887 గ్రామాల్లో దాదాపు 1.54 కోట్ల మంది ప్రజలకు నేత్ర పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మాధ్యమిక స్థాయి ఆసుపత్రుల్లో 6,42,290 మందికి కంటి శుక్లాల శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించగా.. ఉన్నత స్థాయి చికిత్సలు అవసరమైన వారు 3,16,976 మంది ఉంటారని నిర్ధారించారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యంలో హైదరాబాద్‌లో సరోజినీదేవి కంటి వైద్యశాల, వరంగల్‌లో ప్రాంతీయ నేత్ర ఆసుపత్రి మాత్రమే చికిత్సలకు అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి. ముందస్తుగా శుక్లాల శస్త్రచికిత్సల నిర్వహణపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రభుత్వ ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లోని శస్త్రచికిత్స గదులను నేత్ర చికిత్సలకు అనుగుణంగా అభివృద్ధి చేసి, సర్కారు వైద్యంలోనే అత్యధిక శస్త్రచికిత్సలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా నేత్ర వైద్యనిపుణులను అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలోనే ఆధునికీకరించిన ఆసుపత్రుల్లో నేత్ర శస్త్రచికిత్సలను నిర్వహిస్తారని వైద్యవర్గాలు తెలిపాయి.


ఆధునికీకరించిన ఆసుపత్రులు
మలక్‌పేట, కింగ్‌కోఠి(హైదరాబాద్‌),  వనపర్తి, నాగర్‌కర్నూల్‌, గద్వాల,    నారాయణపేట, నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి, సంగారెడ్డి, గజ్వేల్‌, మెదక్‌, బోధన్‌, కామారెడ్డి, వర్ధన్నపేట, జనగామ, ములుగు, మంచిర్యాల, నిర్మల్‌.