ముందస్తు జాగ్రత్తలతో దూరం..
-చేతులను తరుచూ శుభ్రంచేసుకోవడమంటే వైరస్‌ను తరిమేయడమే..
-ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తికి అవకాశం
-అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
రెడ్డికాలనీ, డిసెంబర్ 23: స్వైన్‌ఫ్లూ ప్రాణాంతక వ్యాధి. గా లి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. స్వైన్‌ఫ్లూ రో గులు దగ్గినా..,తుమ్మినా వైరస్ గాలిలో కలుస్తుంది. ఆ గాలిని పీలిస్తే ఇతరులకు సోకుతుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్లు పడిన చోట కూడా వైరస్ అంటుకొని ఉంటుం ది. పొరపాటున దాన్ని ముట్టుకున్న చేతితో నోరు, ముక్కు, కళ్లను రుద్దుకుంటే ఇక అంతే సంగతులు. హెచ్-1, ఎన్-1 వైరస్ రక్తంలో ఉండదు. శ్వాసకోశ అవయవాల్లో ఉంటుంది. అందువల్ల డాక్టర్లు ముక్కు లేదా నోటి నుంచి దూదిపుల్లతో స్రావాలను తీసి పరీక్షిస్తారు. స్వైన్ ఫ్లూ పరీక్షను ప్రత్యేక ప్రయోగశాలల్లో మాత్రమే నిర్వహిస్తారు. జిల్లాలో గతేడాది 6 కేసులు నమోదుగా 2019లో 10 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు వైద్యాధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఇద్దరు చనిపోయారని, వ్యాధిగ్రస్తులంతా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినవారే అంటున్నారు వైద్యాధికారులు.
ముందస్తు జాగ్రత్తలతో దూరం
స్వైన్ ఫ్లూ హెచ్-1 ఎన్-1 అనే అంటు వ్యాధి ఇన్‌ఫ్లూయంజా 'ఏ' వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఇది మనిషి నుంచి మనిషికి గాలి ద్వారా సోకుతుంది. ఈ వ్యాధి ఊపిరితిత్తుల అంతర భాగాలకు సోకడం వల్ల ప్రమాదకారిగా మారి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుంది. మనిషి నుంచి మనిషికి దగ్గినప్పుడు.., తుమ్మినప్పుడు.., మాట్లాడుతున్నప్పుడు వచ్చే తుంపర్ల వల్ల స్వైన్‌ఫ్లూ వ్యాది వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకూ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. అపరిశుభ్రమైన వాతావరణం వ్యాధుల వ్యాప్తికి మరో కారణంగా మారుతుంది. జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న విషజ్వరాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అన్ని ప్రాథమిక ఆరోగ్య, ఉప కేంద్రా ల్లో ప్రజలకు స్వైన్‌ఫ్లూ అవగాహన కల్పిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పి, ఒళ్లునొప్పులు, విరేచనాలు, శ్వాస తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.