వాషింగ్టన్, డిసెంబరు 23 : కాఫీలోని కెఫిన్ అనే పదార్థం అలసటను దూరం చేస్తుందని మనకు తెలుసు!! హృద్రోగాలు రాకుండా, శరీరం/రక్తంలో కొవ్వు పేరుకుపోకుండా చేసే గుణాలు కూడా అందులో సమృద్ధిగా ఉన్నాయని అమెరికాలోని ఇల్లినాయిస్ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. వారు అధ్యయనంలో భాగంగా నాలుగు వారాలపాటు ఎలుకలకు ద్రవరూపంలో కెఫిన్‌ను అందించారు. ఇదే కాలంలో మరికొన్ని ఎలుకలను కెఫిన్‌కు దూరంగా ఉంచారు. ఇతర ఎలుకలతో పోల్చుకుంటే కెఫిన్ ద్రావణం తాగిన మూషికాల శరీర బరువు(16 శాతం), కొలెస్టరాల్(22 శాతం) తక్కువగా పెరిగినట్లు గుర్తించారు. ఫలితంగా వాటిలో స్థూలకాయం సమస్య తగ్గుముఖం పట్టినట్లు నిర్ధారించారు.