వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేసిన కేర్ వైద్యులు
హైదరాబాద్: పుట్టుకతోనే ఛాతీ, గుండెలో లోపం ఉన్న వ్యక్తికి అరుదైన శస్త్ర చికిత్స ద్వారా హైదరాబాద్ కేర్ వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. అరుదైన బీటింగ్ హార్ట్ సర్జరీ చేసినట్లు వైద్యులు సోమవారం తెలిపారు. వాస్తవానికి బైపాస్ సర్జరీ సమయంలో గుండె కొట్టుకోవడాన్ని వైద్యులు నిలుపుదల చేస్తారు. గుండెకు బదులు శరీర వ్యవస్థను హార్ట్ లంగ్ యంత్రానికి అనుసంధానం చేస్తారు. ఇది కూడా గుండె మాదిరిగా రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేస్తుంది. ఆపరేషన్ తర్వాత మళ్లీ గుండె కొట్టుకోవడాన్ని పునరుద్ధరిస్తారు. తాజాగా నగరానికి చెందిన మహ్మద్ కుత్బుద్దీన్(45)కు బీటింగ్ హార్ట్ విధానంలో శస్త్ర చికిత్స చేశారు. తీవ్రమైన న్యూమోనియా ఉండటంతో తప్పనిసరిగా ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. కుత్బుద్దీన్‌కు చిన్నతనం నుంచి ఛాతి ప్రాంతంలో సమస్య ఉంది. ఛాతి పైభాగంలో ఒక ఎముక పైకి పొడుచుకు వచ్చి ఛాతి దిగువ భాగంలో ఎముక లోపలకు కుంచించుపోయింది. జన్యులోపం కారణంగా చాలా అరుదుగా ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుంది.ఇటీవల ఆరోగ్యం విషమంగా మారడటంతో కుటుంబ సభ్యులు కేర్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు ఈ లోపాన్ని గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి సరిచేయాలని నిర్ణయించారు. డాక్టర్ ప్రతీక్ భట్నాగర్, డాక్టర్ రియాజ్‌ఖాన్ బృందం అరుదైన వెస్సల్ కరోనరీ బైపాస్ సర్జరీ ద్వారా ఎముకలను సరిచేసి గుండెపై ఒత్తిడి పడకుండా చేశారు. శస్త్ర చికిత్స అనంతరం ఆయన కోలుకోవడంతో డిశ్చార్జి చేశామన్నారు.