వైద్యాన్ని తిరస్కరించి.. మృత్యు ఒడిలోకి!

ఇంద్రవెల్లి,  : ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగరం గ్రామానికి చెందిన వెట్టి లక్ష్మి(35) వైద్యాన్ని తిరస్కరించి, ఆసుపత్రి వారికి తెలియకుండా ఇంటి బాట పట్టి మృత్యువాత పడిన సంఘటన మంగళవారం చోటుచేసుకొంది. వివరాలలోకి వెళితే.. లక్ష్మి నిండు గర్భిణిగా ఉన్నప్పుడు రక్తహీనతతో బాధపడింది. ఈ సమయంలో.. లక్ష్మి భర్త వెట్టి సీతారాం, కుటుంబీకులకు పీహెచ్‌సీ వైద్యుడు శ్రీధర్‌ అవగాహన కల్పించారు. అయినా వైద్యుడి మాటలను వారు పక్కనబెట్టారు. ప్రసవం దగ్గర పడుతుండటంతో ఈ నెల 8న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సహాయ అధికారి డా.కుడ్మేత మనోహర్‌ లక్ష్మి ఇంటికి వెళ్లి నచ్చజెప్పారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రసవం సక్రమంగా జరిగినా రక్తహీనత అలాగే ఉందని, రక్తం ఎక్కించినా శరీరంలో రక్తం నిలవడం లేదని వైద్యులు తెలిపారని లక్ష్మి భర్త సీతారాం పేర్కొన్నారు. లక్ష్మి మృతిపై పిట్టబొంగరం పీహెచ్‌సీ వైద్యుడు డా.శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మి గర్భిణిగా ఉన్న సమయంలో వైద్యం తిరస్కరించిందన్నారు. గ్రామ పెద్దలతో మాట్లాడి ఈ నెల 8న జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లామన్నారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వారికి సూచించారని తెలిపారు. అక్కడే ఆమె ప్రసవమైంది. పాలనాధికారి దివ్య దేవరాజన్‌, ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్యలు స్పందించి లక్ష్మి వైద్యం కోసం రూ.50 వేల ఆర్థికసాయం కూడా చేశారని తెలిపారు. ఈ నెల 10న గాంధీ ఆసుపత్రికి వచ్చిన నిమ్స్‌ వైద్యులు పరీక్షలు చేయగా లక్ష్మి.. మైలో డిస్‌ప్లేస్టిక్‌ సిండ్రోం అనే వ్యాధితో బాధపడుతోందని డా.శ్రీధర్‌ వివరించారు. హైదరాబాద్‌లోనే చికిత్స అందించడానికి వైద్యులు నిర్ణయించగా.. లక్ష్మి వారికి తెలియకుండా పసిగుడ్డును తీసుకొని ఈ నెల 19న ఇంటికి వచ్చిందని తెలిపారు. ఇంటికి వచ్చిన లక్ష్మి వద్దకు వెళ్లానని.. తిరిగి హైదరాబాద్‌ ఆసుపత్రికి వెళ్లాలని చెప్పినా వినలేదని తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆమె మృతిచెందింది. 14 రోజుల బాలింత చనిపోవడంతో పసిపాప.. తల్లి ప్రేమకు దూరం అయ్యాడని బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.