ఖమ్మం : ఖమ్మం జిల్లా యువజన క్రీడల శాఖ జిమ్నాస్టిక్స్ శిక్షకుడు గౌస్‌పాష గురువారం ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులను వెలుగులోకి తెచ్చిన శిక్షకుడిగా గౌస్ పేరుగాంచారు. ఖమ్మంలో పటేల్ స్టేడియం నిర్మాణానికి ముందు పెవిలియన్ మైదానంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ శిక్షణా కేంద్రం కొనసాగింది. నాటి రోజుల్లో ఎలాంటి సదుపాయాలు లేకున్నా కేవలం రెండు మ్యాట్లు ఆరుబయట వేసి శిక్షణ ప్రారంభించారు. రాష్ట్రంలో రిథమిక్ జిమ్నాస్టిక్స్ అంశాన్ని పరిచయం చేసి అందులో సాధన చేయించి జాతీయ స్థాయి పతకాలు సాధించిన వ్యక్తిగా గౌస్ సుపరిచితుడు. గౌస్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయనది స్వస్థలం వరంగల్ అయినా ఖమ్మంలో స్థిరపడ్డారు. ఆసిఫాబాద్‌లో కొన్నేళ్లు డీవైఎస్వోగా చేసినప్పటికీ ఉన్నతాధికారులకు ఖమ్మం శిక్షణా కేంద్రం గురించి వివరించి తిరిగి ఇక్కడికే శిక్షకుడిగా వచ్చారు.