తలనొప్పి తాళలేక బాలిక ఆత్మహత్య

అల్లంవారిపాలెం: తలనొప్పి తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఫిరంగిపురం మండలంలో జరిగింది. అల్లంవారిపాలెంకు చెందిన కొండవీటి సత్యనారాయణకు వినుకొండకు చెందిన రాజేశ్వరితో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి విమల, సంధ్య అనే ఇద్దరు కుమార్తెలు. వీరు నాయనమ్మ వద్దనే ఉంటూ చదువుకుంటున్నారు. విమల నాదెండ్లలోని కస్తూర్బా పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.గత 40 రోజులగా తలనొప్పి, జ్వరం రావడంతో కొద్ది రోజులుగా అల్లంవారిపాలెంలోనే ఉంటోంది. గురువారం రాత్రి ఇంట్లోని వారంతా నిద్రపోయారు. తెల్లారాక నాయనమ్మ, తాతయ్యలైన రాఘవమ్మ, అనంతరాములు ఎవరి పనిలో వారు ఉన్నారు. నిద్రపోయిన పిల్లలను లేపేందుకు వెళ్లగా చీర సాయంతో విమల ఫ్యానుకు ఉరివేసుకొని కనిపించింది. వెంటనే కిందకు దించి పరిశీలించగా అప్పటికే చనిపోయినట్లు  గుర్తించారు. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ అస్సాన్‌ సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఫిరంగిపురం పోలీసులు తెలిపారు.