ఆటలతోనే ఆరోగ్యం

జగిత్యాల: ఆటలతోనే ఆరోగ్యం అని జిల్లా ఎస్పీ సి.హెచ్‌.సింధుశర్మ అన్నారు. జగిత్యాల మినీస్టేడియంలో గురువారం జిల్లాస్థాయి పోలీసు క్రీడలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. మానసిక ఉల్లాసం, దేహదారుఢ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని దీనిని  దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అధికారుల నుంచి సిబ్బంది వరకు మూడు రోజులపాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలోని పోలీసులకు తొలిసారి క్రీడలు ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు. జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటే ఐశ్వర్యం ఉన్నట్లేనని చెప్పారు. నిత్య జీవితంలో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొనే పోలీసులకు క్రీడలతో ఉత్తేజం, ఉత్సాహం పెరుగుతుందన్నారు. స్పెషల్‌ బ్రాంచి, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, జగిత్యాల, మెట్‌పల్లి డీఎస్పీలు రామారావు, సి.ప్రతాప్‌, పి.వెంకటరమణ, ఎం.డీ.గౌస్‌బాబా, సీఐలు కె.జయేష్‌రెడ్డి, టి.లక్ష్మిబాబు, కె.కిషోర్‌, ఎం.రవికుమార్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు వామనమూర్తి, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.