సహనమే ప్రగతికి మార్గం.. అది ధ్యానంతోనే సాధ్యం

కడ్తాల్‌, ఆరోగ్యజ్యోతి : సహనమే ప్రగతికి మార్గమని, అది ధ్యానం ద్వారానే సిద్ధిస్తుందని ధ్యాన గురువు సుభాష్‌ పత్రీజీ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండల కేంద్ర సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్‌లో 11 రోజుల ధ్యాన మహోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. సుభాష్‌ పత్రీజీ ఆధ్వర్యంలో మహిళా ధ్యాన మహాచక్రం-10 మహోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ధ్యాన, శాకాహార జగత్తు లక్ష్యంగా నిర్వహించిన ధ్యాన మహోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ధ్యానులు, సందర్శకులు, పిరమిడ్‌ మాస్టర్లు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మంగళవారం తెల్లవారు జామున పత్రీజీ వేణునాద, సామూహిక అఖండ ధ్యానం ఆకట్టుకొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహనాన్ని పెంచుకొని ముందుకు సాగేవారు అద్భుతంగా రాణించి, ఆనందమయ జీవితాన్ని పొందుతారన్నారు. అంతరించి పోతున్న మానవ, నైతిక విలువల పెంపునకు ధ్యాన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అత్మసత్యం తెలిసిన వారే జ్ఞానులని, అది ధ్యానం ద్వారా ప్రాప్తిస్తుందన్నారు. ముగింపు వేడుకల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, నాగర్‌కర్నూల్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ పద్మావతి పాల్గొన్నారు. ధ్యానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముగింపు వేడుకల సందర్భంగా వివిధ రాష్ట్రాల కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.