కీళ్ల మార్పిడికి నిధులు విడుదల చేయాలి

విశాఖపట్నం: కింగ్‌ జార్జి ఆసుపత్రిలో మోకీలు మార్పిడి చికిత్సలకు అవసరమైన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ జి.అర్జున తెలిపారు. మంగళవారం ఆసుపత్రి ఆవరణలోని ఎముకల విభాగంలో మోకీలు మార్పిడి చేసుకున్న రోగులకు అవగాహన శిబిరం నిర్వహించారు. డాక్టర్‌ అర్జున మాట్లాడుతూ స్టేల్‌ ఇల్‌నెస్‌ ఫండ్‌ కింద విడుదలైన నిధులతో గత ఏడాది 150 మందికి మోకీలు మార్పిడి చికిత్సలు చేశామన్నారు. దీనికి రూ.70లక్షల వరకు ఖర్చు అయిందన్నారు. రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే రోగులకు మోకీలు మార్పిడి చికిత్స చేసేందుకు రూ.2కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. త్వరలో నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌, ఎముకల విభాగాధిపతి డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌, ప్రొఫెసర్లు డాక్టర్‌ శివనాథ్‌, డాక్టర్‌ ఎల్‌.లోక్‌నాధ్‌ పాల్గొని మోకీలు నొప్పులపై రోగులకు అవగాహన కల్పించారు. రెండో దశ చికిత్స కోసం రోగుల పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రోగుల సందేహాలు, అనుమానాలను నివృత్తి చేశారు. ఆసుపత్రి ఉప పర్యవేక్షక వైద్యాధికారిణి డాక్టర్‌ కె.ఇందిరాదేవి, ఆర్‌ఎంఓ డాక్టర్‌ సాధన పాల్గొన్నారు.