పల్లెలపై ‘నిఘా’

సమస్యాత్మక గ్రామాల గుర్తింపులో పోలీసులు
గతంలో గొడవలైన చోట ప్రత్యేక దృష్టి
ముందస్తు బైండోవర్లకు ఉన్నతాధికారుల ఆదేశం
గుంటూరు :పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తు ఎన్నికలకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే వాటికి సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ క్రమంలోనే భద్రతా పరంగా గుంటూరు అర్బన్‌, రూరల్‌ జిల్లాల పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రాజకీయంగా ఎంతో సున్నితమైన జిల్లా కావటంతో ఇప్పటి నుంచే ఎన్నికలకు పటిష్ఠమైన భద్రత, శాంతిభద్రతలు అదుపులో ఉండటానికి ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఎక్కడెక్కడ సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి? గతంలో ఆయా గ్రామాల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి.. నేరాల పాత రికార్డుల ఆధారంగా ఆ గ్రామాల జాబితాలు రూపొందించి పంపాలని ఇద్దరు ఎస్పీలు ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా హింసాత్మక సంఘటనలు గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఎన్నికల అనంతరం ఇక్కడ రాజకీయ గొడవలు జరగటం తెదేపా సానుభూతిపరులను కొన్ని గ్రామాల్లో ఊరు విడిచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేయటం వంటివి జరిగాయి. వీటన్నింటి నేపథ్యంలో స్థానిక ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించడానికి ఈసారి ముందుగానే పోలీసులు అప్రమత్తమయ్యారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ప్రత్యేకించి రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎక్కడెక్కడ గొడవలు జరగటానికి ఆస్కారం ఉందనే సమాచారం డివిజన్ల వారీగా అడిగి తెలుసుకుని వాటిని అరికట్టడానికి ఏం చర్యలు తీసుకోవాలో తగు సూచనలు చేశారు. ఈనెల రెండో వారంలోనే నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉండటంతో  గ్రామాల్లో ఆయా రాజకీయ పక్షాలకు నేతృత్వం వహిస్తున్నవారు ఎవరు.. గతంలో జరిగిన పంచాయతీ, సార్వత్రిక ఎన్నికలప్పుడు ఘర్షణలకు పాల్పడిన వారి వివరాలతో వేర్వేరుగా జాబితాలు సిద్ధం చేసి వెంటనే పంపాలని ఆయన డీఎస్పీలను ఆదేశించారు. ఎన్నికలకు సమయాభావం తక్కువగా ఉండటంతో ఈ పనులకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. జిల్లాలో నరసరావుపేట, గురజాల, తెనాలి డివిజన్ల పరిధిలో బాగా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ప్రాథమిక జాబితా రూపొందించారు. ఈ మండలాల్లోని గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రౌడీషీటర్లు ప్రతి వారం స్టేషన్లకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.


గ్రామాల దత్తత..
ఇంతకు ముందే ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లకు దత్తత గ్రామాలు కేటాయించారు. అక్కడ పరిస్థితులపై దత్తత తీసుకున్న వారిలో చాలామంది సిబ్బందికి అవగాహన లేదు. కాలక్రమేణా కొందరు బదిలీ జరిగి వేరే ప్రాంతానికి వెళ్లారు. ప్రస్తుతం వీటిని దృష్టిలో పెట్టుకుని వెంటనే ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక్కో కానిస్టేబుల్‌కు తిరిగి దత్తత గ్రామాలను కేటాయించాలని ఇదంతా మూడు, నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. వెంటనే కానిస్టేబుళ్లను దత్తత గ్రామాలకు పంపి అక్కడ నెలకొన్న తాజా పరిస్థితులపై నివేదికలు తెప్పించుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. కేవలం స్పెషల్‌ బ్రాంచి, ఇంటెలిజెన్స్‌ అధికారులు ఇచ్చే సమాచారంపైనే ఆధారపడకుండా నేరుగా గ్రామాల్లో పరిస్థితులను స్టేషన్‌ పోలీసులే తెలుసుకుని వాటిపై దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాలని భావిస్తున్నారు.


బైండోవర్లకు ఆదేశం..
రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రౌడీషీటర్లు, ఘర్షణలకు పాల్పడే వారు, సమస్యలు సృష్టించే వారిని వెంటనే బైండోవర్‌ చేసి వారి కదలికలపై నిరంతరం ఆరా తీయాలని స్టేషన్‌ అధికారులను ఆదేశించారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తు, పురపాలికల ఎన్నికలు ఒకదాని వెంట ఒకటి వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు బైండోవర్లు వెంటనే  చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఏ అలజడి జరిగినా వెంటనే స్టేషన్లకు తెలిసేలా గ్రామాల్లో సమాచార సేకరణకు కొందరిని సోర్స్‌గా పెట్టుకోవాలని సూచించారు. ఈ విషయం ఇతరులకు తెలియకుండా గోప్యత పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతల ఫోను నంబర్లు సేకరించి ఉంచుకోవాలని ఆదేశించారు.