ఆసుపత్రికి భద్రత

ప్రత్యేక సిబ్బంది భర్తీకి ఆదేశాలు


ఔట్‌పోస్టు ఏర్పాటు


 నిజామాబాద్‌,ఆరోగ్యజ్యోతి :


ప్రభుత్వ వైద్యకళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో జరుగుతున్న గొడవలు.. వైద్యులపై దాడులకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ప్రత్యేక పోలీసు భద్రతను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇది వరకు ఒక కానిస్టేబుల్‌ మాత్రమే ఉండేవారు. వైద్యులకు మరింత భద్రత కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(టీఎస్‌ఎస్‌పీఎఫ్‌) పేరుతో హోంశాఖ ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సోమవారం జీవో జారీ చేసింది.జిల్లాతో పాటు మహబూబ్‌నగర్‌ వైద్యకళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో ప్రత్యేక పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇద్దరు ఎస్‌ఐలు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 30 మంది కానిస్టేబుళ్లను నియమించనున్నారు. ఆసుపత్రిలోనే ప్రత్యేకంగా పోలీస్‌ ఔట్‌పోస్టును ఏర్పాటు కానుంది.


పోకిరీల ఆటకట్టు...ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందిపై పోకిరీలు, రోగులతో సంబందం లేని వ్యక్తులు దాడులు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌ వద్ద, వార్డుల్లో, ప్రవేశ ద్వారం వద్ద గొడవలు జరిగేవి. సెక్యూరిటీ సిబ్బంది భయపడుతూ ఉద్యోగం చేస్తున్నారు. కొత్తవారు రావడానికి వెనకడుగు వేశారు. ఆసుపత్రి భద్రత ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించాలనే నిర్ణయంతో వైద్యులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.