- ఇదీ మనం జీవితం మొత్తంలో తింటున్న ప్లాస్టిక్
ఆకలేసిన పొట్టకు బువ్వ పెట్టి చల్లార్చుతున్నాం. కానీ, ఆ బువ్వలోనే మనకు కనిపించే సైజులోనే ప్లాస్టిక్ కలిసిపోతోంది. మన కడుపులో చేరిపోతోంది. ఒక్కో ప్లాస్టిక్ ముక్క నువ్వు గింజంత సైజులో ఉంటోంది. ఇటీవల మైక్రోప్లాస్టిక్స్‌పై డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) ఇంటర్నేషనల్ ఓ స్టడీ చేసింది. సముద్రాల నుంచి ఆర్కిటిక్ దాకా, మంచు కొండల నుంచి భూమి పొరల దాకా ప్లాస్టిక్‌తో పాటు మైక్రోప్లాస్టిక్ కలిసిపోతోందని ఆ స్టడీ హెచ్చరించింది. అవి మన కడుపులోకి చేరిపోతున్నాయని చెప్పింది. మనం నేరుగా తినకపోయినా, మనం తినే ఆహార పదార్థాల్లో కలిసిపోయి మన పొట్టల్లోకి చేరిపోతున్నాయని చెప్పింది. చేపలు, మాంసం, ఇతర ఆహార ధాన్యాలతో అవి ఎక్కువగా వస్తున్నాయని తెలిపింది. దానిపైనే 'రాయిటర్స్' గ్రాఫిక్స్ రూపంలో మనం ఎప్పుడెప్పుడు ఎంత మైక్రోప్లాస్టిక్ తింటున్నామో వివరించింది.
వారానికి 5 గ్రాములు
వారానికి మన కడుపులోకి చేరిపోతున్న మైక్రోప్లాస్టిక్ మొత్తం ఇది. అంటే ఓ బాటిల్ క్యాప్ లేదా ఓ స్పూన్ నిండా నింపితే ఎంతైతే ప్లాస్టిక్ వస్తుందో అంత మొత్తంలో మనం ప్లాస్టిక్‌ను లాగించేస్తున్నాం.
పదేళ్లకు రెండున్నర కిలోలు
ఈత నేర్చుకునేటప్పుడు మనం నడుముకు కట్టుకునే ప్లాస్టిక్ బెండు బరువుతో సమానంగా మనం పదేళ్లలో ప్లాస్టిక్‌ను హాంఫట్ అనిపించేస్తున్నాం. రెండున్నర కిలోల మైక్రోప్లాస్టిక్స్ కడుపులోకి చేరిపోతున్నాయి.
నెలకు 21 గ్రాములు
దీని బరువు కాసినోల్లోని 5 డైస్ (స్క్వేర్‌గా ఉండే పాచికలు) అంత మొత్తం. మినీ రైస్బౌల్లో సగం. ఓ నెలలో ఆహారంతో పాటు మనం తింటున్న మైక్రోప్లాస్టిక్ 21 గ్రాములు.
6 నెలలకు 125 గ్రాములు
పిల్లలకు సిరీల్స్ తినిపించే గిన్నె నిండుగా పోస్తే వచ్చేంత బరువు. మనకు తెలియకుండానే మనం 125 గ్రాముల ప్లాస్టిక్‌ను పొట్టలోకి పంపిస్తున్నాం.
జీవితం మొత్తంలో 20 కిలోలు
ఓ చిన్న బియ్యం బస్తా బరువు 25 కిలోలుంటుంది. దాంట్లో ఐదు కిలోలు తీసేస్తే 20 కిలోల మైక్రోప్లాస్టిక్‌ను మనం భోజనంతో పాటే కానిచ్చేస్తున్నాం. చెత్తపడేసే రెండు ప్లాస్టిక్ బిన్నులకు (ఒక్కోటి పది కిలోల బరువు అనుకుంటే) సమానం.
ఏటా పావు కిలో
ప్లేట్ నిండా పెట్టుకునే అన్నం బరువుతో సమానం. సరాసరి మనం పావు కిలో మైక్రోప్లాస్టిక్‌ను తింటున్నాం.
ఇది చాలా సీరియస్
కొన్నేళ్ల తరబడి మనం ప్లాస్టిక్‌ను వాడుతున్నాం. కానీ, మైక్రోప్లాస్టిక్, నానో ప్లాస్టిక్‌ల వల్ల కలిగే నష్టాలు, మన హెల్త్‌పై పడే ప్రభావాలను మాత్రం అంచనా వేయట్లేదు. మనం తినే ఆహారంతో పాటే అవి మన కడుపుల్లోకిచేరిపోతున్నాయి. చేయకూడని నష్టాన్ని చేస్తున్నాయి. ఇది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమే.
– థవ పళనిస్వామి, యూనివర్సిటీ ఆఫ్ న్యూ కేజిల్, ఆస్ట్రేలియా, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్టడీలో పాల్గొన్న సైంటిస్ట్