21వ శతాబ్దిలో పెద్ద పాత్ర పోషించాలి ఇందుకు సన్నద్ధం కావాలి

బెంగళూరు: యువశక్తి సాయంతో 21వ శతాబ్దంలో గణనీయ పాత్ర పోషించేలా ఆత్మావలోకనం చేసుకొని, తనను తాను తీర్చిదిద్దుకోవాలని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ‘‘భారత బలాన్ని, ప్రపంచ పటంలో మన స్థానాన్ని ఈ దశాబ్దం నిర్వచించబోతోంది. యువశక్తి, యువ ఆవిష్కర్తలదే ఈ దశాబ్దం’’ అని పేర్కొన్నారు. గురువారం ఆయన డీఆర్‌డీవోకు చెందిన ఐదు ‘యువ శాస్త్రవేత్తల ప్రయోగశాల’లను జాతికి అంకితం చేశారు. ఇవి బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా, ముంబయిలో ఏర్పాటవుతాయి.


యువతకు సత్తా, స్వప్నాలు, ఆకాంక్షలు, రిస్కు తీసుకునే సామర్థ్యం అపారంగా ఉన్నాయని, వాటిని ఒడిసిపట్టేందుకే యువ ప్రయోగశాలలను ఏర్పాటు చేశామని ప్రధాని చెప్పారు. ఇక్కడ జరిగే ప్రయోగాల్లో ఏమైనా నష్టాలు చోటుచేసుకున్నప్పటికీ భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫలితం ఎలా ఉన్నా అక్కడ సృజనాత్మకతకు అవకాశం ఉండటమే ఇందుకు కారణమన్నారు. ఉగ్రవాద ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌కు మాత్రమే కాక ప్రపంచానికీ సేవలు అందించే అవకాశం శాస్త్రవేత్తలకు ఉందని పేర్కొన్నారు. ‘‘చుట్టూ మిత్ర దేశాలు ఉండటం వల్ల అనేక దేశాలకు సరిహద్దు సంబంధ భద్రతా ముప్పులు లేవు. అలాంటి చోట్ల కూడా నేడు ఉగ్రవాదం పంజా విసురుతోంది. ఆ దేశాలు కూడా ఆయుధాలు పట్టాల్సి వస్తోంది. అలాంటి దేశాల అంతర్గత భద్రత కోసం డీఆర్‌డీవో సాయం చేయాలి. ఇది మానవాళికి సేవ అవుతుంది. ప్రపంచ వేదికపై భారత పలుకుబడిని పెంచుతుంది’’ అని శాస్త్రవేత్తలకు సూచించారు. ఆ దేశాల అవసరాలు గణనీయంగా పెరుగుతున్నాయని అక్కడి నేతలతో సమావేశమైనప్పుడల్లా తనకు తెలుస్తోందన్నారు.


పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకొని రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి డీఆర్‌డీవో కృషి చేయాలని మోదీ సూచించారు. ‘‘మీ సామర్థ్యం అపారం. మీరు ఎన్నో సాధించగలరు. మీ పరిధులను విస్తరించుకోండి. మీ పనితీరుకు సంబంధించిన పరామితులను మార్చుకోండి. రెక్కలు చాచి గగన విహారం చేయండి. మీకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. మీకు నేను అండగా ఉన్నా’’ అని పేర్కొన్నారు. సైబర్‌, అంతరిక్ష రంగంలో తలెత్తే ముప్పులకూ డీఆర్‌డీవో సిద్ధంకావాలన్నారు. భవిష్యత్‌లో తెలివైన యంత్రాలు రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో భారత్‌ వెనుకబడి ఉండకూడదని పేర్కొన్నారు.