గుండెపోటు బాధితులు వేగంగా కోలుకునేలా..!

మెల్‌బోర్న్‌: గుండెపోటు బాధితులు త్వరగా కోలుకోవడంలో దోహదపడగల సరికొత్త ఔషధం త్వరలో అందుబాటులోకి రానుంది. రక్త కణాల నుంచి సేకరించిన ఓ ప్రత్యేక ప్రోటీన్‌తో ఈ ఔషధాన్ని ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన బృందం అభివృద్ధి చేసింది. సాధారణంగా గుండెపోటు కారణంగా వ్యక్తుల్లో హృదయ కండరాలు దెబ్బతింటాయి. ఫలితంగా గుండె వైఫల్యం ముప్పు అధికమవుతుంది. రక్తం గడ్డ కట్టడంలో దోహదపడే రక్త కణాల నుంచి సేకరించిన ‘రికాంబినెంట్‌ హ్యూమన్‌ ప్లేట్‌లెట్‌- డిరైవ్డ్‌ గ్రోత్‌ ఫ్యాక్టర్‌-ఏబీ (ఆర్‌హెచ్‌పీడీజీఎఫ్‌-ఏబీ)’ అనే ప్రోటీన్‌తో ఈ ముప్పును తగ్గించవచ్చునని పరిశోధకులు తాజా అధ్యయనంలో తేల్చారు. గుండె కండరాల్లో నూతన రక్తనాళాలు ఏర్పడేందుకు, హృదయ స్పందనల్లో అసహజ రీతులను తగ్గించేందుకు ప్రోటీన్‌ ఉపకరిస్తుందని వివరించారు. ఫలితంగా బాధితులు వేగంగా కోలుకుంటారని పేర్కొన్నారు.