బళ్లారి, (ఆరోగ్యజ్యోతి): బళ్లారి ఉత్సవ సమితి, జిల్లా ఆసుపత్రి, విమ్స్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు స్థానిక హెచ్.ఆర్.గవియప్ప కూడలిలో ఏర్పాటు చేసిన నైటింగేల్ చిత్రపటానికి నగర శాసనసభ్యుడు గాలి సోమశేఖరరెడ్డి, విమ్స్ బాధ్య సంచాలకుడు డా.దేవానంద్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రధానాచార్యురాలు జ్యోతి, జిల్లా ఆసుపత్రి బాధ్యుడు డా.బసరెడ్డి, విద్యా వేత్త నర్సింగ్ సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేకు కోసి పంచిపెట్టారు. నైటింగేల్ జీవిత చరిత్ర, సేవాభావాన్ని గుర్తుచేసుకున్నారు. అక్కడి నుంచి జిల్లా అధికారి కార్యాలయం గుండా గడిగి చెన్నప్ప కూడలి, అనంతపురం రహదారి మీదుగా జిల్లా ఆసుపత్రి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నర్సింగ్ విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు. కొందరు నర్సింగ్ విద్యార్థులు నైటింగేల్ వేషధారణలో కనిపించారు.