ఒంగోలు : నవరత్నాల కార్యక్రమంలో భాగంగా థలసీమియా, డయాలసిస్ రోగుల పింఛన్ జాబితా తయారీలో అలక్ష్యం వహించిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌వో) బి.వినోద్‌కుమార్‌పై వేటు పడింది. ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ భాస్కర్ ఉత్తర్వులిచ్చారు. అదనపు డీఎంహెచ్‌వో కె.పద్మావతిని ఇన్‌ఛార్జిగా నియమించారు. వైద్యశాఖలో పాలనాపరమైన లోపాలున్నట్లు గుర్తించిన కలెక్టర్ మంగళవారం సాయంత్రం ఆ కార్యాలయానికి వెళ్లి అత్యవసర సమావేశం నిర్వహించారు. జేసీ-2 నరేంద్రప్రసాద్ కూడా హాజరయ్యారు. డీఎంహెచ్‌వో పరిధిలో అమలు జరుగుతున్న అన్ని కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఏ విభాగంలో ఎంతమంది పని చేస్తున్నారు. వారిపై పర్యవేక్షణ అధికారి ఎవరు అనే వివరాలు సేకరించారు.
బాధితులు అన్యాయమై పోరా...
ఆరోగ్యశ్రీ ద్వారా 9 రకాల తీవ్ర జబ్బులతో బాధపడుతున్న వారిని గుర్తించి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు నెలవారీ పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన వారి జాబితాను డిసెంబరు 20కల్లా పంపాలని గత నెలలో కోరినా డీఎంహెచ్‌వో కార్యాలయం పంపలేదు. దీనిపై సోమవారం రాష్ట్ర కార్యాలయం నుంచి కలెక్టర్‌కు ఫోన్ రాగా ఆయన డీఎంహెచ్‌వోను వివరాలు కోరారు. మరుసటి రోజు 295 పేర్లతో జాబితా ఇవ్వడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. అత్యంత ప్రాధాన్యత గల అంశంపై సకాలంలో స్పందించనందుకు డీఎంహెచ్‌వోపై చర్యలు తీసుకున్నారు. అసలు ఆ శాఖలో ఏమి జరుగుతుందో తెలుసుకునేందుకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బాధితులను అన్ని స్థాయిల్లో గుర్తించి నివేదిక పంపితే వారికి మేలు జరుగుతుంది. ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తే అన్యాయమై పోరా అని సిబ్బందిని ప్రశ్నించారు.
సమగ్ర జాబితా తయారీకి ఆదేశం...
రిమ్స్, ప్రాంతీయ ఆసుపత్రులు, ప్రైవేటు వైద్యశాలలు, పీహెచ్‌సీ స్థాయిలో అర్హులైన బాధితుల సమాచారం నాలుగు రోజుల్లో అందజేయాలని కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. ఈ అంశంపై జనవరి రెండో తేదీ వైద్యాధికారులతో, నాలుగో తేదీన ప్రైవేటు వైద్యశాలల వారితో సమావేశం నిర్వహిస్తామన్నారు. డీఎంహెచ్‌వో పరిధిలో ఉన్న అన్ని విభాగాలపై సమగ్ర నివేదిక ఇచ్చే బాధ్యతను జేసీ-2కు అప్పగించారు. జాబితా వచ్చాక వారు అర్హులా కాదా అనేది ఎంపీడీవోల ద్వారా పరిశీలించి, తర్వాత గ్రామ సచివాలయ కార్యదర్శుల ద్వారా పునఃపరిశీలన చేయించాలని సూచించారు. డయాలసిస్ చేయించుకోడానికి రిమ్స్‌కు వచ్చే వారిని మాత్రమే గుర్తిస్తే సరిపోదని, రాని వారిని కూడా కనిపెట్టి జాబితాలో చేర్చాలని చెప్పారు. జాబితా తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత జూనియర్ సహాయకునిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు, డీఎంహెచ్‌వో వినోద్‌కుమార్, డీసీహెచ్‌ఎస్ ఉషా, ఆరోగ్యశ్రీ, మలేరియా ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.