అమ్మకు మళ్లీ కష్టమొచ్చింది!

మోసుకు వస్తుండగా మార్గమధ్యలో ప్రసవం


● మారుమూల గిరిజన గర్భిణులకు తప్పని అవస్థలు


ఎస్‌.కోట, (ఆరోగ్యజ్యోతి): వైద్యులు చెప్పినట్లు ప్రసవానికి సమయం ఇంకా ఉండటంతో ఆమె ధీమాగా ఉంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా నొప్పులు రావడంతో 14 కిలో మీటర్ల్ల దూరంలో ఉన్న రోడ్డుకు ఆమెను డోలీ కట్టి మోసుకుంటూ తీసుకువస్తున్నారు. మార్గమధ్యలోకి వచ్చేసరికి నొప్పులు ఎక్కువయ్యాయి. కుటుంబ సభ్యుల్లో ఒకటే ఆందోళన. దారి పక్కనే ప్రసవం జరగడం... తర్వాత ఆమెను 108 వాహనంలో ఆసుపత్రికి చేర్చడం.. అంతా ఈ ఆందోళన నడుమ సాగింది. గర్భిణులైన గిరిజన మహిళలకు ఈ కష్టాలు తప్పడం లేదు. 


అవే డోలీ కష్టాలు


శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీ శివారు పొర్లు గ్రామానికి చెందిన గర్భిణి కేరంగి చిన్నాలమ్మకు ప్రసవ సమయం ఈనెల 17గా చెప్పడంతో ఆమె ఇంటి వద్దే ఉంటోంది. బుధవారం తెల్లవారు జామున 5గంటల ప్రాంతంలో నొప్పులు ఎక్కువవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి భర్త కుమార్‌, బంధువులు డోలీ కట్టి మోసుకుంటూ వస్తున్నారు. సుమారు 14 కిలోమీటర్లు దూరం నాలుగు కొండలు ఎక్కి దిగితే గాని దబ్బగుంటకు చేరుకోలేరు. అయిదుగురు ఆమెను మోసుకుంటూ తీసుకువస్తుండగా దారపర్తికి దబ్బగుంటకు మధ్యలో సుఖ ప్రసవం జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆడ శిశువు జన్మించింది. డోలీలో మళ్లీ తల్లీబిడ్డలను మోసుకుంటూ దబ్బగుంటకు వచ్చారు. అక్కడ ఉన్న 108వాహనంలో శృంగవరపుకోట సామాజికాసుపత్రికి తీసుకువచ్చారు. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టరు ఆర్‌.త్రినాథరావు, స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టరు సుధా తెలిపారు.ఆమెకు 10 రోజుల ముందుగానే వచ్చి ఆసుపత్రిలో చేరమని చెప్పామని వైద్యులు తెలిపారు.