పాఠ్యాంశంగా నైతిక విలువలు

హైదరాబాద్‌ : వచ్చే విద్యాసంవత్సరం నుంచి నైతిక విలువలను పాఠ్యాంశంగా చేర్చబోతున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఇందుకోసం మాజీ డీజీపీలతో కమిటీ వేస్తామని, చినజీయర్‌ స్వామి సలహాలు తీసుకుంటామని తెలిపారు. మాజీ డీజీపీ హెచ్‌.జె.దొర రచించిన తన ఆత్మకథ ‘జర్నీ త్రూ టర్బులెంట్‌ టైమ్స్‌’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి గురువారం ప్రగతి భవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అర్థవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు కూడా సహకరించాలన్నారు. మంచిని కాపాడటానికి కఠినంగా వ్యవహరించడం తప్పుకాదని, కర్తవ్య నిర్వహణలో ఇది అవసరమని, ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టంలేకపోయినా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలు గుర్తించి, గౌరవించి కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని, ఇది తప్పుకాదని, సమాజానికి మంచి జరుగుతుందనుకున్నప్పుడు అవి కఠినమైనప్పటికీ చేయకతప్పదన్నారు.


సంపూర్ణ అక్షరాస్యతకు పోలీసులు ముందుకు రావాలి
డీజీపీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పోలీసులు సమాజంలోని రుగ్మతలను తొలగించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని, కేవలం శాంతిభద్రతల పర్యవేక్షణకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో అనేక పనులు నిర్వర్తిస్తున్నారని కేసీఆర్‌ వివరించారు. ఇదే తరహాలో తెలంగాణను సంపూర్ణ అక్షరాస్యతా రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూడా పోలీసులు ముందుకు రావాలని, చదువు రాని వారందర్నీ అక్షరాస్యులుగా మార్చే ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు.


హెచ్‌.జె.దొర తన అనుభవాన్నంతా రంగరించి మంచి పుస్తకం రాశారని ముఖ్యమంత్రి చెప్పారు. టీమ్‌వర్క్‌తో విజయాలు సాధించడం, క్లిష్టమైన సమయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడం, నేరాలు అదుపు చేయడానికి అవలంబించాల్సిన పద్ధతులు, వనరుల వినియోగం వంటివి దొర స్వీయ అనుభవం ద్వారా నేర్చుకున్నారని వివరించారు. వాటన్నింటినీ స్ఫూర్తిగా తీసుకొని పోలీసులు ముందుకెళ్లాలన్నారు. సిబ్బందికి ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తూ వారిలో నైపుణ్యం పెంపొందించాలని, దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆదేశించారు.ఎవరూ వెయ్యేళ్లు బతకరని, జీవించినంతలోనే ఎంత గొప్పగా బతికామన్నదే ముఖ్యమని, అలాంటి వారిలో దొర ఒకరన్నారు.