జాతీయ సమ్మెకు మద్దతుగా రాష్ట్ర బంద్‌

 



సత్తెనపల్లి : ఈనెల 8వ తేదీన 11 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన జాతీయ సమ్మె.. గ్రామీణ బంద్‌కు మద్దతుగా రాష్ట్ర బంద్‌ నిర్వహించాలని వామపక్షాలు నిర్ణయించినట్లు సీపీఎం పశ్చిమ జిల్లా కార్యదర్శి గద్దె చలమయ్య పేర్కొన్నారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని.. ప్రజల మధ్య విద్వేషాలు రేపుతున్న ఎన్‌ఆర్‌సీ.. సీఏఏ.. ఎన్‌పీఆర్‌లను రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాలకు మద్దతుగా వామపక్ష పార్టీలు రాష్ట్ర బంద్‌ నిర్వహించబోతున్నాయన్నారు. ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసగిస్తున్న అధికార.. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడట్లేదన్నారు. అమరావతి.. మూడు రాజధానుల పేరుతో ప్రజా సమస్యలను రెండు పార్టీలు పక్కకు నెట్టాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తలపెట్టిన బంద్‌లో కార్మికులు, రైతులు, ఉద్యోగులు, మేధావులు, మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పార్టీ నాయకులు గుంటూరు విజయకుమార్‌, మామిడి వెంకటేశ్వరరావు, గుంటుపల్లి బాలకృష్ణ, పొట్టి సూర్యప్రకాశరావు, మల్లేశ్వరి, హరిపోతురాజు, సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.