హైదరాబాద్: రిజర్వేషన్లు ఖరారు చేయకుండా పురపాలక, నగరపాలక సంఘాల ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేయడంపై భాజపా అభ్యంతరం వ్యక్తం చేసింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత.. అభ్యంతరాలు తెలిపేందుకు కనీసం వారం రోజుల సమయం ఉండాలని, ఆ మేరకు షెడ్యూలును సవరించాలని కోరింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డిని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ తెలంగాణ ఎన్నికల సంఘం కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జనగణనలో జరిగిన తప్పులను తక్షణమే సరిదిద్దాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లకు 4న రిజర్వేషన్లు ప్రకటించి.. 7న ఎన్నికల షెడ్యూలు జారీచేస్తే అభ్యంతరాలకు తగిన సమయం దొరకదు. ఇది అధికారపార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని భాజపా ప్రతినిధులు ఆందోళన చెందారు.