గుంటూరు వైద్యం, : అత్యాధునిక వైద్య పరిశోధనల ఫలితంగా ఇప్పుడు శుక్లాల బెడదను తేలికగా పరిష్కరించవచ్చని సదస్సు నిర్వాహక కార్యదర్శి డాక్టర్ రాజేశ్ సూచించారు. గుంటూరు వైద్య కళాశాలలో కంటి వైద్యుల సంఘం ఆధ్వర్యంలో శుక్లాల శస్త్రచికిత్సలపై నిరంతర వైద్య విద్య కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ అత్యాధునిక వైద్య పరిశోధనలతో తిరిగి నవయవ్వన దృష్టిని పునఃసృష్టి చేసే స్థాయికి నేటి వైద్యరంగం చేరుకుందన్నారు. పాత పద్ధతిలో కనుగుడ్డుపై పెద్ద కోత పెట్టి ముదిరిన శుక్లాన్ని బయటకు తీసేవాళ్లమన్నారు. ఇప్పుడు ఆపరేషన్ చేసే పద్ధతి చాలా మారిపోయిందన్నారు. ఫేకో ఎమల్సిఫికేషన్ అని పిలిచే నూతన విధానంలో కనుగుడ్డు పైపొర మీద చిన్న రంధ్రం చేసి, దాని గుండా సూదిలాంటి పరికరాన్ని లోనికి పంపి, శుక్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఆ సన్న రంధ్రం నుంచే వాటిని బయటకు తీసేస్తారన్నారు. దాని స్థానంలో కృత్రిమ కవాటాన్ని అమర్చుతారన్నారు. దీంతో చూపు చక్కబడుతుందన్నారు. శుక్లాల ఆపరేషన్ చాలా తేలికగా పూర్తవుతుందని, సురక్షితమైనదన్నారు. ఈ నూతన విధానం ప్రకారం శుక్లం బాగా ముదరక ముందే, అంటే అది బాగా గట్టి పడక ముందే, చూపు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తున్నపుడే శస్త్రచికిత్స చేయించుకోవటం ఉత్తమమన్నారు. శుక్లాలు ముదరాలని ఎదురుచూడటం మంచిది కాదన్నారు. గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, మధుమేహులు, నీటికాసులు తదితర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు శస్త్రచికిత్స సమయంలో వచ్చే సమస్యలు, పరిష్కారాలను వివరించారు. అనంతరం ఆచార్య వాణాతి మాట్లాడుతూ నల్లగుడ్డుకు సంబంధించిన సమస్యలున్నప్పుడు శుక్లాల శస్త్రచికిత్సలను ఏవిధంగా నిర్వహించాలో సూచించారు. అంతకుముందు కంటి వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య ఫరిణికుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వైద్య మండలి పరిశీలకులు సతీశ్‌కుమార్ మాట్లాడుతూ ఈ సదస్సుకు హాజరైన వైద్యులకు రెండు క్రెడిట్ అవర్స్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థి వైద్యులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో కాటూరి వైద్య కళాశాలకు మొదటి స్థానం, గుంటూరు వైద్య కళాశాలకు ద్వితీయ స్థానం దక్కింది. సమావేశంలో ఎన్నారై వైద్య కళాశాల ప్రధానాచార్యులు లక్ష్మి, జీఎంసీ నుంచి ఆచార్యులు ఉదయ్‌కుమార్, రమేశ్‌కుమార్, విజయశేఖర్, రవిబాబు(విజయవాడ), సంధ్యావళి(ఒంగోలు)తోపాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి పలువురు వైద్యులు, విద్యార్థి వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.