ఆదిలాబాద్ బల్దియా అభ్యంతరాలు వందకు ఒక అడుగు దూరంగా మిగిలిపోయింది. వార్డుల్లో ఓటర్ల తారుమారుపై అభ్యంతరాల ప్రక్రియ ముగిసింది. ఆక్షేపణలు అందించేందుకు చివరి రోజు కావడంతో గురువారం అనేక మంది ఆశావహులు బల్దియా కార్యాలయానికి వరుస కట్టారు. ఫిర్యాదుల దాఖలుతో బల్దియా కార్యాలయం సందడిగా మారింది. కులాల మార్పుపై వచ్చిన అభ్యంతరాల కంటే.. ఓటర్ల తారుమారుపైనే ఎక్కువగా రావడం గమనార్హం. శుక్రవారం వీటన్నింటిని పరిష్కరించి ఈ నెల 4వ తేదీన వార్డులు, పోలింగ్ కేంద్రాలు, కులాల వారీగా తుది జాబితాను వెల్లడించాల్సి ఉంటుంది. అనంతరం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
ఒక వార్డులో రావాల్సిన ఓటర్లు.. మరో వార్డులోకి వెళ్లారు. కొన్ని వార్డుల్లో వందల సంఖ్యలో ఓట్లు తారుమారయ్యాయి. కొన్ని వార్డుల ఓటర్లు సమీప వాటిలో కాకుండా దూరంగా ఉన్నవాటిలో కలపడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. పోటీలో ఉండే వివిధ పార్టీల నాయకులు, ఆశావహులు ఆందోళన వ్యక్తం చేశారు. తారుమారైన ఓటర్లు.. వాటి ఇంటి సంఖ్యల ఆధారంగా వివరాలు సేకరించి వాటిని కలపాలని.. మరికొన్నింటిని తొలగించాలని అభ్యర్థించారు. పురపాలక కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కేంద్రంలో అర్జీలు సమర్పించారు. ఫిర్యాదులు స్వీకరించిన నాటి నుంచి వార్డుల వారీగా వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు వెంటనే సంబంధిత పత్రాలతో వార్డులకు సిబ్బందిని పంపించారు. కులాల మార్పులు జరిగితే వారిని నిర్ధరించేందుకు గుర్తింపు పత్రాలు స్వీకరించి వాటిని సరిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆయా వివరాలు సేకరించిన అనంతరం కార్యాలయంలో దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ఆయా వార్డుల వారీగా వచ్చిన అభ్యంతరాలు సరైనవా.. కావా అనే విషయాలను తెలుసుకుంటూ వాటికి పరిష్కారం చూపిస్తున్నారు. ఇందుకు నేటివరకు సమయం ఉండటంతో అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేస్తోంది. వాటిని పరిష్కరించడమే కాకుండా.. పరిష్కరించకుంటే ఎందుకు చేశామో సంబంధిత ఫిర్యాదుదారులకు రాతపూర్వకంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.