బంధాలు మరచి... అల్లుడు ప్రాణాలు తీసుకునేలా చేసి..!

 అమరావతి: అమ్మానాన్నలెవరైనా.. తమ పిల్లల బాగును కోరుకుంటారు
వారి జీవితాలు ఆనందంగా ఉండాలనుకుంటారు
వారు దారి తప్పితే సరిదిద్దేందుకు ప్రయత్నిస్తారు
అందుకు వారిద్దరూ వ్యయ ప్రయాసలోడ్చుతారు..!!
ఇందుకు భిన్నంగా.. ఓ తల్లిదండ్రులు డబ్బుపై స్వార్థంతో దారి తప్పారు
వివాహమైన కుమార్తెకు డబ్బున్న వాడు వచ్చాడని
అతనితో కూతురుకు రెండో పెళ్లి చేయాలని
పెళ్లైన రెండు నెలలకే అల్లుడ్ని హింసించారు..!!
కుమార్తె తోడుగా.. వేధించడం రెట్టింపు జేశారు
అసభ్యకరంగా ప్రవర్తించారు
వారిని ఎదుర్కొన లేక..  వేధింపులు భరించ లేక ఆ అల్లుడు ప్రాణాలు తీసుకున్నాడు..!!


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గుంటూరు జిల్లా అమరావతి మండల కేంద్రానికి చెందిన పల్లపు తిరుపతిరావు (22) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయితో ఆరు నెలల క్రితం వివాహం అయింది. రెండు నెలలపాటు వారి సంసార జీవితం అతని ఇంట్లోనే ఆనందంగా సాగింది. ఆ తర్వాత ఇద్దరూ అత్తారింటికి వెళ్లి నాలుగు నెలల నుంచి అక్కడే ఉంటున్నారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులను వారి బంధువుల్లో ఒకరైన బాగా డబ్బున్న వారు కలిసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని వచ్చారు. వారు బాగా దనవంతులు కావడంతో వారితో పెళ్లికి రహస్య ఒప్పందం చేసుకున్నారు. ఎలాగైనా కూతురు నుంచి అల్లుడిని వేరు చేయాలనుకున్నారు. అప్పటి నుంచి అల్లుడ్ని వేధించడం ప్రారంభించారు. వారికి తోడుగా అతని భార్య కూడా నిలవడంతో వేధింపులు పెరిగాయి. అంతటితో ఆగకుండా వారు రోజూ అసభ్యకరంగా మాట్లాడేవారు. ఇంట్లో పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా మారుతోంది. దీంతో తిరుపతిరావు అత్త, మామ, భార్యను ఎదుర్కొనలేక 2వ తేదీ తల్లిదండ్రుల ఇంటికి వచ్చేశాడు. శనివారం తిరుపతిరావుకు కూలీ పని చేసే దగ్గర అతని భార్య వచ్చి కలిసింది. వారి మధ్య కాసేపు వివాదం జరిగింది. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో..ఆయన శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్మకు పాల్పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు మా కుమారుడ్ని అత్త, మామలే ఇబ్బంది పెట్టారని, అందుకే ప్రాణాలు తీసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిలో వారు పెట్టిన ఇబ్బందులను పేర్కొన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీంద్రబాబు చెప్పారు.