కణ ఆకృతి ఆధారంగా వ్యాధి నిర్ధారణ సరికొత్త ప్రక్రియను అభివృద్ధి చేస్తున్న భారత శాస్త్రవేత్తలు

దిల్లీ: అనేక రకాల వ్యాధులను గుర్తించేందుకు చౌకైన ఒక కొత్త ప్రక్రియను భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో రసాయన ఆధారిత ల్యాబ్‌ పరీక్షల ద్వారా కాకుండా కణాల భౌతిక లక్షణాల ప్రాతిపదికన రోగ నిర్ధారణ జరుగుతుంది. కణంలో జన్యు పదార్థాన్ని కలిగి ఉండే కేంద్రకం ఆకృతి ఆధారంగా సదరు కణానికి సంబంధించిన జీవరసాయన తీరుతెన్నులను అంచనా వేయవచ్చని బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) శాస్త్రవేత్త జి.కె.అనంత సురేశ్‌ తెలిపారు. కేంద్రక ఉపరితల విస్తీర్ణం, పరిమాణం, 2డీ పరంగా కణం కనిపించే తీరు వంటి అంశాల మధ్య పరస్పర సంబంధం ఉందన్నారు. యాక్టిన్‌ అనే ప్రొటీన్‌లో మార్పుల వల్ల కేంద్రకం చుట్టూ ఉన్న పొరలో తన్యత పెరుగుతుందని చెప్పారు. దీనివల్ల కేంద్రకం ఆకృతి మారుతుందని తెలిపారు. ఈ విధానాన్ని ఉపయోగించి హెపటైటిస్‌ సి వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల కాలేయ కణ కేంద్రక ఆకృతిలో వచ్చిన మార్పులను గుర్తించామన్నారు. అయితే క్యాన్సర్‌, మలేరియా, సికిల్‌ సెల్‌ ఎనీమియా వంటి వ్యాధులను గుర్తించే వీలుందని చెప్పారు.