అభివృద్ధి అంటే రాజధానిని విభజించడం కాదని వ్యాఖ్య
అమరావతి: రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మందడంలో రైతులు చేస్తున్న నిరసనకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మద్దతు పలికారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై పోలీసులు అన్యాయంగా దౌర్జన్యం చేశారని రాజధాని మహిళలు ఈ సందర్భంగా ఎంపీకి ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేయటమే కాకుండా ఎదురు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గల్లా జయదేవ్ మాట్లాడుతూ... పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతుల్ని, మహిళల్ని కించపరిచే వారు సిగ్గుపడాలన్నారు. అన్నం పెట్టే రైతులకు సెల్ ఫోన్లు, బంగారు గొలుసులు ఉంటే తప్పేంటని దుయ్యబట్టారు. దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు విఫలమయ్యాయని గుర్తు చేస్తూ... అభివృద్ధి అంటే రాజధానిని విభజించటం కాదని చెప్పారు. అలా చేస్తూ పోతే.. ఖర్చు పెరుగుతుందే తప్ప ఆదాయం రాదని ఆయన హితవు పలికారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో రాజధాని అంశంపై గట్టిగా పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదని గల్లా స్పష్టం చేశారు.