మూత్రపిండాల్లోకి నేరుగా జన్యువుల చేరవేత!

సరికొత్త విధానాన్ని ఆవిష్కరించిన పరిశోధకులు



వాషింగ్టన్‌: మూత్రపిండ సంబంధిత వ్యాధులను ప్రభావవంతంగా అడ్డుకోగల జన్యు చికిత్సా విధానాలను అభివృద్ధి చేసే దిశగా పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. జన్యువులను సిరల ద్వారా నేరుగా మూత్రపిండాలకు చేరవేసే వ్యవస్థను ఆవిష్కరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పలు విధానాలు జన్యువులను నిర్దేశిత భాగాలకు ప్రభావవంతంగా చేర్చలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని 'మయో క్లినిక్‌' పరిశోధకులు ఔషధ సరఫరా నిమిత్తం సరికొత్త వ్యవస్థను రూపొందించారు. ఔషధాల చేరవేత కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన విభిన్న అడినో-అసోసియేటెడ్‌ వైరస్‌ (ఏఏవీ) వాహకాలను ఎలుకల మూత్రపిండాల్లోకి నూతన విధానంలో సమర్థంగా చేరవేశారు. వ్యాధుల చికిత్స, నివారణకు ఉద్దేశించిన జన్యువులను నిర్దేశిత భాగాలకు చేర్చేందుకు తమ ఆవిష్కరణ దోహదపడుతుందని పరిశోధకులు తెలిపారు.