దిల్లీ: కొద్ది రోజుల క్రితం అదృశ్యమైన ఓ వైద్యుడు, వైద్యురాలి ఆచూకీని దిల్లీ పోలీసులు కనుగొన్నారు. వారిద్దరూ సిక్కింలో ఉన్నట్లు గుర్తించారు. వైద్యురాలైన తన భార్య కనిపించడం లేదంటూ ఆమె భర్త దిల్లీలోని హౌజ్‌కాస్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భార్య మరో వైద్యుడితో కలిసి డిసెంబర్ 25వ తేదీన చర్చికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో అదృశ్యమైన వైద్యుల్లో ఒకరి స్వస్థలమైన విశాఖపట్నానికి కూడా దిల్లీ పోలీసులు వచ్చి ఆరా తీశారు. చివరికి వైద్యుల సెల్‌ఫోన్లు, ఫేస్‌బుక్‌ల ఖాతాల ఆధారంగా సిక్కింలో ఉన్నట్లు గుర్తించారు. వీరిని దిల్లీకి తీసుకువచ్చి విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.