రాజకీయాల్ని ధనమే శాసిస్తోంది లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ

హైదరాబాద్‌: ప్రస్తుతం దేశంలో రాజకీయాల్ని డబ్బే శాసిస్తోందని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రజాస్వామ్య పీఠం ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్‌ నారాయణ అభిప్రాయపడ్డారు. డబ్బుంటేనే రాజకీయాల్లో రాణించగలుగుతున్నారని.. ప్రధాన పార్టీలు సైతం డబ్బున్న వారికే సీట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఈ నెల 9, 10వ తేదీల్లో ప్రజాస్వామ్య పీఠం ఆధ్వర్యంలో ‘ఆచరణలో భారత ప్రజాస్వామ్యం’ పేరిట నిర్వహించనున్న సదస్సు వివరాలను గురువారం వెల్లడించారు. రాజకీయాల్లో సీటు ఇవ్వాలంటే పార్టీలు అభ్యర్థి ధనవంతుడా? కాదా? అనేది మాత్రమే చూస్తున్నాయని, గెలిచిన నేతలు సంపాదన మీదే దృష్టి పెడుతున్నారని చెప్పారు. ఓట్ల కొనుగోలు ప్రధాన సమస్యగా మారిందన్నారు. ఈ అంశంపై సరైన చర్చ జరగాల్సిన అవసరముందని చెప్పారు. ఏటా ప్రజాస్వామ్య పీఠం ఆధ్వర్యంలో రాజకీయ నాయకులు, మేధావులందరినీ ఓ వేదికపైకి తీసుకొచ్చి సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది సమావేశంలో ‘రాజకీయాల్లో ధన ప్రాబల్యం’ అంశాన్ని ప్రధాన చర్చకు తీసుకురానున్నట్లు ఆయన వివరించారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ప్రాంగణంలో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం రాజనీతిశాస్త్ర విభాగం, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సదస్సులో పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే చర్చలు జరుపనున్నట్లు వెల్లడించారు. జనవరి 9న జరిగే తొలి సమావేశాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. ప్రముఖ పాత్రికేయులు అరుణ్‌శౌరీ, జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, రాజకీయనేతలు జైరాం రమేశ్‌, సీతారాం ఏచూరి, భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్‌, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఇండియన్‌ డెమోక్రసీ ఎట్‌వర్క్‌ సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.