పుర ఎన్నికల్లో ఓడితే పదవులు ఊడతాయ్‌!

హైదరాబాద్‌: పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఒక్క చోట ఓడినా సంబంధిత మంత్రుల పదవులు పోతాయని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సున్నితంగా హెచ్చరించారు. అభ్యర్థుల గెలుపోటములకు శాసనసభ్యులే బాధ్యత వహించాలన్నారు. వారికే బి-ఫారాలను ఇస్తున్నామన్నారు. టికెట్ల పంపిణీ, తిరుగుబాటుదారుల బుజ్జగింపులు అన్నీ ఎమ్మెల్యేలే చూసుకోవాలన్నారు. రాష్ట్రంలోని 3148 వార్డులు, డివిజన్లు సహా 120 పురపాలక సంఘాలు, 10 నగర పాలక సంస్థల్లో తెలంగాణ రాష్ట్రసమితి ఘన విజయం సాధిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయని, తెరాసకు పోటీయే లేదని అన్నారు. కాంగ్రెస్‌ జాడ కనిపించడంలేదని, భాజపాకు బలం లేకున్నా సొంత డబ్బా కొట్టుకుంటోందని వ్యాఖ్యానించారు. పౌరసత్వ సవరణ చట్టంపై పార్టీ విధానాన్ని ఇప్పటికే పార్లమెంటులో స్పష్టం చేశామన్నారు.  శనివారం తెలంగాణభవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి కేసీఆర్‌ అధ్యక్షత వహించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు.


అవసరమైన చోట మంత్రుల ప్రచారం
ఎన్నికల ప్రచారానికి మంత్రులే నాయకత్వం వహించాలి. అవసరమైన ప్రాంతాలకు మంత్రులు స్వయంగా ప్రచారానికి వెళ్లాలి. అందరినీ కలుపుకొని వెళ్లకపోతే ఇబ్బందులు తప్పవు. పెత్తనం ఇచ్చామని దుర్వినియోగం చేయవద్దు. మంత్రులందరి నియోజకవర్గాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్క పురపాలక సంఘంలో ఓడిపోయినా వారి పదవులు పోతాయి (సీఎం నవ్వుతూ ఈ మాట చెప్పగానే... సమావేశంలోని అందరూ నవ్వారు). మంత్రి మల్లారెడ్డి  పరిధిలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు కలిపి తొమ్మిది ఉన్నాయి. కష్టపడి పనిచేసి వీటన్నిటినీ గెలిపించుకోవాలి.
* తెదేపాలో ఉన్న బాబూమోహన్‌ను తెరాసలోకి తీసుకొని ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి గెలిపించుకున్నా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. దీంతో ఆందోల్‌ టికెట్‌ను ఉద్యమకారుడు క్రాంతికి ఇచ్చాను. ఆయన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గెలిచారు. బాగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలందరూ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఎదగాలి. శాసనసభ ఎన్నికలప్పుడు సంగారెడ్డిలో పార్టీ అభ్యర్థి ప్రభాకర్‌ను ఖరారు చేశాం. హరీశ్‌రావు సైతం ఆయనను గెలిపిస్తామని చెప్పారు. స్థానికంగా సమన్వయలోపం వల్ల ప్రభాకర్‌ ఓడిపోయారు. అందరూ కలిసి పనిచేస్తేనే ఎక్కడైనా గెలుస్తాం.
* ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు. మజ్లిస్‌ మనకు మిత్రపక్షం. పురపాలక ఛైర్మన్లు, మేయర్లు, ఉపాధ్యక్ష ఎన్నికలకు అవసరమైతే సహకారం తీసుకుంటాం. పురపాలక ఛైర్మన్లు, మేయర్లను అధిష్ఠానమే ఎంపిక చేస్తుంది. పురపాలక, నగర పాలక సంఘాల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులైన రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఈ నెల 25న  తెలంగాణభవన్‌కు రావాలి. వారు ఎక్కడ ఓటు వేయాలో ఆ రోజు నిర్ణయిస్తాం.