ఆరోగ్యమస్తు

తుని(ఆరోగ్యజ్యోతి): అనేక మంది మహిళలు రోజువారీ పనుల్లో తీరికలేకుండా ఉండి తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తుంటారు. ఇలాంటి వారిలో ఉన్న వ్యాధులను గుర్తించి వారికి మంచి చికిత్స, మందులు అందించడానికి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జిల్లాలో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. ముఖ్యంగా మురికివాడల్లో ఉంటున్న అనేక మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు అవగాహనలేమితో పలు వ్యాధులకు గురవుతున్నారని హెల్త్‌ రిసోర్స్‌పర్సన్ల సర్వేల్లో స్పష్టమైంది.


బయటపడుతున్న దీర్ఘకాలిక వ్యాధులు


జిల్లాలో 2019 సెప్టెంబరు నుంచి పొదుపు సంఘాల మహిళలకు 18 రకాల పరీక్షలు చేయడానికి సన్నాహాలు చేశారు. సాధారణంగా చేసే రక్త, మూత్ర పరీక్షలతో బీపీ, షుగర్‌, హిమోగ్లోబిన్‌ స్థితిగతులు తెలుస్తుండగా, ఇతర పలు ఇబ్బందులతో బాధపడుతున్న వారికి అదనంగా పరీక్షలు చేయిస్తున్నారు. దీంతో అనేక మంది మహిళల్లో టీబీ, థైరాయిడ్‌, ఎయిడ్స్‌, కిడ్నీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు బయటపడుతున్నాయి. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 35 సంవత్సరాల వయసు దాటిన 29,340 మంది మహిళా ఆరోగ్య సమితి సభ్యులు, పొదుపు సంఘాల మహిళలకు పరీక్షలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిలో ఇప్పటికే 25,120 మందికి ప్రక్రియ పూర్తిచేయగా పలువురికి చిన్న చిన్న సమస్యలే ఉండగా వారికి వైద్యులు పలు సూచనలు చేశారు. ఇంకొందరిలో మొదటి, రెండోదశలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు బయటపడగా వాటికి సంబంధించి మందులు, చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలికలతోపాటు పురపాలికలు, నగర పంచాయతీల్లోను మెప్మా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని పట్టణాల్లో 32 మంది హెచ్‌ఆర్పీలు క్షేత్రస్థాయిలో నిత్యం మహిళల ఆరోగ్య పరిరక్షణకు కృషిచేస్తున్నారు. ఎవరిలో ఏ ఆరోగ్య సమస్య ఉందన్న విషయాన్ని బయటవారికి చెప్పకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. 2018లో గర్భాశయ, బ్రెస్ట్‌ క్యాన్సర్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, 2019లో పరిసరాలు - వ్యక్తిగత పరిశుభ్రత, రుతుస్రావంపై మాస్‌ సభ్యులకు శిక్షణ ఇచ్చి మరింత మందిని చైతన్యం చేసేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకున్నారు.


మార్చినాటికి పరీక్షలు పూర్తిచేస్తాం


ఈ ఏడాది మార్చి నాటికి నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగా మిగిలిన మహిళలకు కూడా పరీక్షలు పూర్తిచేస్తాం. ఇంకా రామచంద్రపురం మున్సిపాలిటీతోపాటు నగర పంచాయతీల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ఈ పరీక్షలు చేపడతాం.