సోమేశ్‌కుమార్ నియామకంలో రాజకీయం
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపణ
హైదరాబాద్: రిజర్వేషన్లు ఖరారు చేయకుండా, తుది ఓటర్ల జాబితా రూపొందించకుండా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం వెనుక కుట్ర దాగి ఉందని భాజపా ఆరోపించింది. ప్రతిపక్ష పార్టీలు న్యాయస్థానానికి వెళ్లే అవకాశం లేకుండా అధికార తెరాస, రాష్ట్ర ఎన్నికల సంఘం కలిసి నాటకం ఆడాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. ఇల్లెందు నియోజకవర్గం కాంగ్రెస్ నేత భాస్కర్‌నాయక్, నాగార్జునసాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు పలువురు లక్ష్మణ్ సమక్షంలో శనివారమిక్కడ కమలదళంలో చేరారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికారపార్టీ నేతలు బోగస్ ఓట్లను చేర్పించి, ప్రతిపక్షాల సానుభూతిపరుల్ని జాబితాల నుంచి తొలగించారని ఆరోపించారు. పలు మున్సిపాల్టీల్లోని వార్డుల్లో ఎస్సీ ఓటర్లను బీసీ, ఓసీలుగా మార్చడంతో ఎస్సీలకు రిజర్వు కావాల్సినవి ఇతరులపరం కానున్నాయన్నారు. సీనియర్ ఐఏఎస్‌లను కాదని ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సోమేశ్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నియమించడం వెనుక రాజకీయ కోణం ఉందని ధ్వజమెత్తారు. ఈ నియామకంలో జరిగిన తప్పిదాన్ని సరిదిద్దాలని సీఎంను డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పిన తెరాస ఆరేళ్ల పాలనలో 28వేల పోస్టులే భర్తీ చేసిందని ఆక్షేపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని.. రుణ వ్యవధిని 40 ఏళ్లకు పెంచుకోవడం ద్వారా వడ్డీల భారాన్ని తెలంగాణపై పెంచారని తెలిపారు. కేసీఆర్ వ్యవసాయక్షేత్రానికి నీళ్లు, ఆయన కుటుంబసభ్యులకే నియామకాలు వస్తున్నాయని..కుమార్తెను రాజ్యసభకు పంపడానికి, కుమారుడిని సీఎంను చేయడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.