ఒప్పంద అధ్యాపకులకు వేతనాలు చెల్లించాలి

నగరంపాలెం(గుంటూరు): ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేసే ఒప్పంద అధ్యాపకులకు వెంటనే వేతనాలు చెల్లించాలని ఐడియల్‌ దళిత్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ గోళ్లమూడి రాజసుందరబాబు కోరారు. గుంటూరు అరండల్‌పేటలోని గీతారిజెన్సీ హోటల్‌లో ప్రభుత్వ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ రాజసుందరబాబు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2000 సంవత్సరంలో 3,720 మంది ఒప్పంద అధ్యాపకులను ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల్లో ఆర్థిక శాఖ అనుమతితో నియమించిందన్నారు. నాటి నుంచి 2019 వరకు వారంతా విధుల్లోనే కొనసాగుతున్నారని, వారికి వేతనాలు అందిస్తున్నారని చెప్పారు. 2019, సెప్టెంబరులో మంజూరు కాని పోస్టుల్లో పని చేస్తున్న 397 మంది అధ్యాపకులకు వేతానాలు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అధ్యాపకులకు వేతనాలు ఆపివేయటంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సురేష్‌ చొరవ తీసుకుని వారికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.జె.గాంధీ, ఉపాధ్యక్షుడు ఆర్‌.విజయభేరి, కార్యదర్శులు సురేష్‌, మోహన్‌, భైరెడ్డి తదితరులు పాల్గొన్నారు.