రెవెన్యూలో ‘కోత’ మొదలైంది! మూడు త్రైమాసిక బిల్లుల్లో కత్తెర

హైదరాబాద్‌: ఆర్థిక మాంద్యం ప్రభావం క్రమంగా ప్రభుత్వ శాఖలపై పడుతోందా? ఖర్చు తగ్గించుకునే వ్యవహారాన్ని ప్రభుత్వ కార్యాలయాలకిచ్చే నిర్వహణ నిధులకు కోత వేయడంతో సర్కారు ఆరంభించిందా? వాస్తవ పరిస్థితి ఔననే సమాధానమిస్తోంది. మూడు త్రైమాసిక నిధుల్లో కోత విధించడమే దానికి నిదర్శనమని అధికార వర్గాలు చెబున్నాయి. ప్రభుత్వ సేవల పరంగా మండలంలో తహసీల్దారు కార్యాలయం కీలకం.రాష్ట్ర వ్యాప్తంగా 585 తహసీల్దారు కార్యాలయాలున్నాయి. వాటి నిర్వహణ ఖర్చుల కింద మూణ్నెల్లకు ఒకసారి ప్రభుత్వం సుమారు రూ.40 వేలు కేటాయిస్తుంది. ఈ ఏడాది మూడు త్రైమాసిక బిల్లుల్లో కోత వేయడంతో రెవెన్యూ అధికారులకు కష్టాలు మొదలయ్యాయి. ప్రజా ప్రతినిధుల పర్యటనల్లో ప్రొటోకాల్‌ ఖర్చులను రెవెన్యూ శాఖ తరఫున తహసీల్దార్లే భరించాలి. అవిగాక షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సభలు, రంజాన్‌, క్రిస్మస్‌ వేడుకల నిర్వహణలు రెవెన్యూ విధుల్లో చేరాయి. ప్రొటోకాల్‌ కోసమే సగటున నెలకు రూ.10 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. కలెక్టర్‌, ఆర్డీవోల సమీక్షలు, కోర్టు కేసులు, మండలంలో ప్రభుత్వ కార్యక్రమాలకు రాకపోకలు వీటికి అదనం.ఇవేమీ అధికారిక పద్దుల్లో ఉండవు. ‘‘కనీసం రూ.10 వేల వేతనం లేనిదే కంప్యూటర్‌ ఆపరేటర్లు విధులకు వచ్చే పరిస్థితి లేదు. సర్కారు మాత్రం స్వీపర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌కు కలిపి మూడు నెలలకు రూ.14,316 ఇస్తోంది. మొత్తంగా కార్యాలయ నిర్వహణకు మూడు నెలలకు కలిపి సుమారు రూ.1.35 లక్షలు ఖర్చవుతుండగా..ప్రభుత్వం సుమారు రూ.40 వేలే కేటాయిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి(జులై, అగస్టు, సెప్టెంబరు) సంబంధించి కార్యాలయ నిర్వహణ బిల్లులు అసలే మంజూరు చేయలేదు. సదరు నిధులు మంజూరైనట్టు సెప్టెంబరులో సమాచారం వచ్చినా తర్వాత వెనక్కు తీసుకున్నారు.’’ అని తహసీల్దార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వాహనానికి నెలకు రూ.33 వేల చొప్పున కేటాయించేవారని, ఇందులోనూ కోత వేసి రెండో త్రైమాసికంలో రూ.64 వేలే విడుదల చేశారని వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో త్రైమాసిక నిధుల్లో రూ.2.50 కోట్ల మేర సర్కారు కోత వేసిందని, కాగితాలు కొనేందుకూ కార్యాలయాల్లో సొమ్ముల్లేవని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.మూడో త్రైమాసికానికి(అక్టోబరు, నవంబరు, డిసెంబరు) సంబంధించి కేవలం విద్యుత్‌ బిల్లుకు 20వేలు, కార్యాలయ నిర్వహణకు రూ.500 చొప్పున ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.