పట్టాభిపురం(గుంటూరు): రాజధాని అమరావతిపై వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా విద్యార్థి, యువజన సంఘాల అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా బంద్ నిర్వహించనున్నారు. అన్ని విద్యార్థి సంఘాలు ఏకతాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడి కలిసికట్టుగా ఆందోళనబాట పట్టాయి. విద్యార్థులను సైతం ఉద్యమంలో భాగస్వాములు చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు బంద్ పాటించాలని నిర్ణయించారు. సోమవారం జిల్లా బంద్ నిర్వహించి ప్రతి కళాశాలకు వెళ్లి కరపత్రాలను అందజేసి ఉద్యమానికి సహకరించాలని ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా ఇప్పటికే సెలవు ప్రకటించాయి. అందరూ ఇదే విధంగా విద్యా సంస్థలను మూసివేసి బంద్‌కు పూర్తిగా సహకరించాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు కోరారు.