ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మంచుదుప్పటి కప్పేసింది. ఉత్తరాదినుంచి వీస్తున్న శీతల గాలులతో జనం వణికిపోతున్నారు. మధ్యాహ్నం వరకు మంచు పొగ తొలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలోని లోహర, సాత్రాల, కోసాయి అటవీ ప్రాంతాలతోపాటు కుమ్రంభీం ఆసీఫాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ప్రధాన రహదారులపై పొగ కమ్మేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చలితీవ్రత వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలివల్ల రోగాల బారిన పడుతున్నామని ఆందోళన చెందుతున్నారు.