హైదరాబాద్: పల్లెల రూపురేఖలను మార్చుకొనేందుకు నడుం బిగించాలని రాష్ట్రంలోని గ్రామ సభలు సంకల్పించాయి. నిధుల కొరత ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసినందున ఇక గ్రామాల వారీగా అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసుకొని వాటికి అనుగుణంగా పనులను చేపట్టాలని, ఉపాధి హామీ వంటి పథకాల తోడ్పాటును పొందాలని తీర్మానించాయి. ప్రభుత్వం మీదే అధారపడటం కాకుండా గ్రామాల అభివృద్ధికి గ్రామస్థులు సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా పల్లెప్రగతి రెండో విడత కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజున గ్రామ సభలతో పల్లెలు హోరెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో కలియతిరిగారు. రెండో విడత కార్యక్రమాల పర్యవేక్షణకు వివిధ స్థాయిల్లోని నలుగురు అధికారులను నియమించటం, 2019 సెప్టెంబరు 6వ తేదీ నుంచి నెలరోజుల పాటు నిర్వహించిన మొదటి విడతలో చేపట్టిన పనుల తనిఖీకి 51 మంది అఖిల భారత సర్వీస్ అధికారులను కేటాయించటం వంటి చర్యల ప్రభావం గ్రామాల్లో స్పష్టంగా కనిపించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పర్యటించారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట సభలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. గ్రామానికి కేఎన్‌ఆర్ గ్రూపు రూ.20 కోట్ల విరాళాన్ని ఇచ్చి, ఎందరికో స్ఫూర్తిగా నిలిచినట్టు ఆయన కొనియాడారు. మిగతా మంత్రులూ తమతమ జిల్లాల్లోని సభలకు హాజరై పచ్చదనం, పరిశుభ్రతలపై గ్రామస్థులతో మాట్లాడారు. రాష్ట్రంలో పలు చోట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల ఏర్పాటుకు శుంకుస్థాపనలు చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభిలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు నర్సింహారావు అనే గ్రామస్థుడు 10 గుంటల భూమిని విరాళంగా అందజేశారు. తనిఖీల కోసం నియమితులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు గ్రామాల సందర్శనను ఆరంభించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా.. అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఇంతవరకు ఎవరూ పర్యటించని మారుమూల మామిడిగూడ గిరిజన గ్రామాన్ని జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్ సందర్శించారు. మట్టిరోడ్లమీదగా దారిలోని వడ్‌గాం వాగును సైతం దాటి ఆమె అక్కడి గ్రామ సభకు హాజరయ్యారు. కలెక్టర్‌గా ఉంటూ నేర్చుకొన్న గోండు భాషలో ఆమె వారి కష్టాలను అడిగినప్పుడు..వాగే తమకు పెద్ద సమస్యగా ఉన్నట్టు గిరిజనులు వాపోయారు. రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్ గ్రామస్థులకు హామీ ఇచ్చారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులు తదితరాలు శుక్రవారం నుంచి ఆరంభమవుతాయి. పల్లెప్రగతి రెండో విడత కార్యక్రమాలను 11 రోజుల పాటు నిర్వహిస్తారు.