హైదరాబాద్, ఆరోగ్యజ్యోతి:రాష్ట్రంలో ప్రిస్కిప్షన్ లేకున్నా ఆన్‌లైన్‌లో మెడిసిన్ దొరుకుతోంది. రూల్స్ ప్రకారం డాక్టర్ రాసిచ్చిన మందుల చీటి చూపిస్తేనే ఆన్‌లైన్‌లో మందులు అమ్మాలి. కానీ, కొన్ని సంస్థలు నిబంధనను అతిక్రమిస్తున్నయ్. చీటీ లేకున్నా మెడిసిన్ అమ్ముతున్నయ్. ఇందుకోసం డాక్టర్ కన్సల్టేషన్ పేరిట ఎత్తుగడకు తెరలేపాయి. సదరు సంస్థల డాక్టర్‌కు మన అనారోగ్య సమస్య చెప్పి కావాల్సిన మందులేవో చెబితే ఆయన ప్ర్కిస్ర్కిప్షన్ ఇస్తరు. అవసరమైతే ఇంకొన్ని మందులు యాడ్ చేస్తరు. దీని ఆధారంగా ఆ సంస్థ మెడిసిన్ ఆర్డర్ తీసుకుని సప్లై చేస్తుంది. ఇలాంటి అన్ ఎథికల్ వ్యవహారాలతో డ్రగ్స్ మిస్ యూజ్ అయ్యే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 'కొన్నిరకాల డ్రగ్స్ ను మత్తు ఉత్ప్రేరకాలుగా వాడుతారు. చాలామంది వీటికి బానిసలవుతున్నారు. ఆన్‌లైన్ అమ్మకం వల్ల మందులు ఈజీగా దొరుకుతాయి. ఇలా బానిసలయ్యే వారి సంఖ్య పెరుగుతుంది' అని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధి కరుణ రమేశ్ అన్నారు.
ఢిల్లీలో ఇలా..
ఆన్‌లైన్ మెడిసిన్ అమ్మకాలపై ఢిల్లీ హైకోర్టులో గతేడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారించిన కోర్టు డ్రగ్స్ మిస్ యూజ్ అవకుండా నిబంధనలు రూపొందించిన తర్వాతే ఆన్‌లైన్ అమ్మకాలకు అనుమతివ్వాలని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం కొత్త సంస్థలకు అనుమతులివ్వడం లేదు. అయితే ఇప్పటివరకూ నిబంధనలు అమల్లోకి రాలేదు. అమ్మకాలను తాత్కాలికంగా నిలిపేయాలని డిసెంబర్ తొలివారంలో అన్ని రాష్ర్టాలకు సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఉత్తర్వులిచ్చింది. కాగా, సెంట్రల్ డ్రగ్ కన్సల్టేటీవ్ కమిటీ, టెక్నికల్ అడ్వైజరీ బోర్డు ఇప్పటికే డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్ రూపొందించాయని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ర్టేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉపేందర్ తెలిపారు.
ప్రతి ప్రిస్కిప్షన్‌కూ యూనిక్ కోడ్
ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాల వల్ల డ్రగ్స్ మిస్ యూజ్ అవకుండా డాక్టర్లు రాసే మందుల చీటీనీ ఆన్‌లైన్ చేయనున్నట్టు సమాచారం. డాక్టర్లు రాసే ప్రతి ప్రిస్క్రిప్షన్‌కూ ఓ యూనిక్ కోడ్ ఇచ్చి, దాన్ని ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌డేట్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆన్‌లైన్ మెడిసిన్ అమ్మే సంస్థలకు ఈ పోర్టల్‌లో లాగిన్ అవడానికి యాక్సెస్ ఇస్తారు. ఈ–ప్రిస్ర్కిప్షన్ ఉన్న కస్టమర్ల నుంచే మెడిసిన్ ఆర్డర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫారిన్ కంట్రీస్‌లో ఈ తరహా నిబంధనలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. దీని వల్ల ఎవరికి పడితే వారికి మందులమ్మే అవకాశం ఉండదని అన్నారు.
డిస్కౌంట్లతో పెరుగుతున్న అమ్మకాలు
ఆన్‌లైన్‌లో ఆఫర్లు మస్తుగ ఇస్తుండటంతో ఎగబడి కొంటున్నరు. వన్ ఎంజీ, ప్రాక్టో, నెట్‌మెడ్స్, మెడ్‌లైఫ్, మెడ్‌ప్లస్ వంటి పలు సంస్థలు రాష్ర్టంలో ఆన్‌లైన్ మెడిసిన్ బిజినెస్ చేస్తున్నయ్. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్లలో 'డిస్కౌంట్' ప్రకటనలు గుప్పించి కస్టమర్లను ఆకట్టుకుంటున్నయ్. సెలెక్టెడ్ మెడిసిన్‌పై 20 నుంచి 50 శాతం డిస్కౌంట్ ఇస్తుండటంతో జనం ఆన్‌లైన్‌లో మెడిసిన్ కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మన రాష్ర్టంలో ఆన్‌లైన్ మెడిసిన్ రంగం పుంజుకుంటోందని డాక్టర్లు చెబుతున్నారు. దేశంలో 2023 నాటికి ఫార్మా బిజినెస్ రూ. 20 వేల కోట్లకు పెరుగుతుందని పలు సంస్థలు అంచనా వేశాయి. మందులమ్ముతున్న సంస్థలు నడిపిస్తున్న యాప్, వెబ్‌సైట్‌లలో లాగిన్ అయి డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ అప్‌లోడ్ చేసి మందులు కొనుక్కోవచ్చు. హైదరాబాద్ సహా రాష్ర్టవ్యాప్తంగా మెడిసిన్ డెలివరీ చేస్తున్నారు.