మొదలైన మహాక్రతువు

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న మహాక్రతువుతో ఆధ్యాత్మికశోభ సంతరించుకుంది. లోక కల్యాణార్థం గురువారం ప్రారంభమైన సహస్ర ఘటాభిషేక సహిత మహాసౌరయాగ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక గోదావరినది తీరం పరిసరాల్లో ఏర్పాటు చేసిన యాగశాల వేదపండితుల మంత్రోచ్ఛరణలతో మార్మోగిపోయింది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, హోమాలతో కళకళలాడింది. ముందుగా గోమాత, గణపతిపూజలతో ఈ మహాక్రతువును ప్రారంభించారు. శృంగేరి ఆస్థాన పౌరాణికులు డా.బాచంపల్లి సంతోష్‌కుమార్‌శాస్త్రి పర్యవేక్షణలో పులి సీతారాంశర్మ ఈ మహాయాగానికి యజ్ఞ ఆచార్యులుగా వ్యవహరిస్తున్నారు. దేవతామూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. మూడురోజులపాటు సుమారు 108 జంటలు ఈ యాగంలో భాగస్వాములవుతున్నాయి. మొదటిరోజు ఉదయం గురువందనంతో ప్రారంభమై గోపూజా, పుణ్యాహవచనం, యాగశాల సంస్కారం, కలశస్థాపన తదితర పూజలు జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను తిలకించారు. మధ్యాహ్నం మహాఅన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం పురవీధులగుండా శోభాయాత్ర నిర్వహించారు. విశ్వనాథ ఆలయం నుంచి సూర్యభగవానుని ఉత్సవ విగ్రహంతో యాగశాల వరకు ఊరేగింపు చేపట్టారు. మహిళలు, చిన్నారుల కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.