త్యాగం చేసిన రైతులపై నిందలు మోపుతారా..?: మాజీ మంత్రి ఆనందబాబు


పట్టాభిపురం(గుంటూరు): ‘ప్రజా రాజధాని అమరావతికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చి త్యాగం చేసిన రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులంటూ నిందలు మోపుతారా? అన్నదాతలను అవమానించడం మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌ల అహంకారానికి నిదర్శనం. 20 రోజులుగా నిద్రాహారాలు మాని నిరసనలు తెలుపుతుంటే కళ్లకు కనిపించడం లేదా’.. అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు. గుంటూరు కలెక్టరేట్‌లో తెలుగుతల్లి విగ్రహం వద్ద గుంటూరు తూర్పు తెదేపా ఇన్‌ఛార్జి మహ్మద్‌ నసీర్‌ ఆధ్వర్యంలో మౌనదీక్ష నిర్వహించారు. గంటకు పైగా మౌనదీక్ష చేపట్టిన అనంతరం ఆనందబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు తుగ్లక్‌ నిర్ణయాలను మించిపోయాయని ఎద్దేవా చేశారు. ‘సీఎం జగన్‌ చేష్టలతో రాష్ట్రాభివృద్ధి మూగబోయింది. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానంటున్నారు. ఆంధ్రులను మీ రాజధాని ఎక్కడని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పుకోవాలి’.. అని నిలదీశారు. జీఎన్‌ రావు, బోస్టన్‌ కమిటీల పత్రాలను బోగి మంటల్లో వేయాలని పిలుపునిచ్చారు. మహ్మద్‌ నసీర్‌ మాట్లాడుతూ జగన్‌కు ప్రజలు ఇచ్చిన మెజార్టీకి జనరంజకంగా పాలించాల్సిందిపోయి.. ప్రజాకంటకంగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘అమరావతిని అభివృద్ధి చేయడం చేతగాకపోతే ఉన్న భవనాల్లోనే పాలన కొనసాగించండి. తర్వాత అధికారంలోకి వచ్చి చంద్రబాబు అభివృద్ధి చేస్తారు. ఏడు నెలల్లో ఏ ఒక్కరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదు. ఉన్న పరిశ్రమలు వెనక్కి పోయాయి. రూ.10,000 కోట్లు ఆదాయం తగ్గిపోయిందంటే జగన్‌ అసమర్థతకు నిదర్శనం’.. అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు, జిల్లా, నగర తెలుగు మహిళ నేతలు పోతురాజు ఉమాదేవి, పానకాల వెంకటమహాలక్ష్మి, ములకా సత్యవాణి, మల్లిక, రమాదేవి, విజయలక్ష్మి, పద్మావతి, సావిత్రి, లక్ష్మి, సుమతి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.