మోటారు వాహనాల చట్టాన్ని సవరించి బస్సు రూట్లపై రోడ్డు రవాణా సంస్థల(ఆర్టీసీల)కు ఉన్న గుత్తాధిపత్యాన్ని ఇటీవల తొలగించిన కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. జనాభా ఐదు లక్షలు పైబడిన నగరాల్లో రవాణా వ్యవస్థపై దృష్టి సారిస్తోంది. భవిష్యత్తులో పెరిగే వాహనాల రద్దీ, కాలుష్య సమస్యలకు పరిష్కారంగా ప్రజారవాణాను బలోపేతం చేయాలని తలపోస్తోంది.. తదనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలన్న సూచనలను పరిశీలనలోకి తీసుకుంది. ఇందులో భాగంగా ఎంపికచేసిన రాష్ట్రాల్లోని రూట్లలో ప్రైవేటు బస్సులను అనుమతించే దిశగా అధ్యయనం ఆరంభించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం- ఇంగ్లాండ్ రాజధాని లండన్ తరహాలో ప్రజారవాణా వ్యవస్థను దేశంలో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. భారీమొత్తంలో అవసరమైన నిధుల్ని ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రాలవారీగా అభిప్రాయాలు సేకరించి కొత్త విధానం అమలుకు అన్ని రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులతో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ త్వరలో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
లండన్‌లో అధ్యయనం
2030 నాటికి నగరాల్లో ద్విచక్ర, త్రిచక్ర, నాలుగుచక్రాల వాహనాల సంఖ్య భారీగా పెరుగుతుంది. వాయుకాలుష్యం, రోడ్లపై వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతాయి.. దీనికి పరిష్కారంగా ఇప్పటినుంచే ప్రజారవాణా వ్యవస్థను పటిష్ఠం చేయాలని ప్రపంచ బ్యాంకు కేంద్రానికి సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణాశాఖ ఉన్నతాధికారులతో పాటు వివిధ రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు నవంబరులో లండన్ వెళ్లి.. అక్కడి ప్రజారవాణా వ్యవస్థను అధ్యయనం చేసి వచ్చారని ఆ బృందంతో వెళ్లివచ్చిన ఓ ఉన్నతాధికారి ఈనాడుకు తెలిపారు.