విజయవాడ,ఆరోగ్యజ్యోతి : ప్రపంచంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, శాంతి నెలకొనాలని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని పెంచేందుకు కోటి శ్రీ దత్త అనఘా వ్రతాలు నిర్వహిస్తున్నట్లు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు. పటమటలోని దత్తపీఠంలో శ్రీదత్త అనఘా వ్రతాన్ని స్వామి మంగళవారం ప్రారంభించారు. వ్రతం ప్రాశస్త్యం తెలిపే కరపత్రాలను ఆవిష్కరించారు. జపాన్ నుంచి వచ్చిన భక్తులకు వాటిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో యుగాలుగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారని వెల్లడించారు. మన జీవితమే కోరికల మయమని, ఇవన్నీ తీర్చే ఈ వ్రతాన్ని భక్తితో చేయాలని సూచించారు. యూరోపియన్లు, అమెరికన్లు, ఆస్ట్రేలియన్లు, మలేషియా వాళ్లు చేస్తున్నారని, ఇప్పుడు జపాన్ వాళ్లు ఈ వ్రతం గురించి తెలుసుకోవడానికి వచ్చారన్నారు. కోటి అనఘా వ్రతం చేస్తే ఇంటికి, ఒంటికి, రాష్ట్రానికి మంచిదని పేర్కొన్నారు. ఆధ్యాత్మికంగా ఎవరైనా, ఎప్పుడైనా చేయవచ్చని, దీనిని మూఢనమ్మకం అనుకోవద్దని, ఇదొక సైన్స్ అని, అందరూ అనుసరిస్తారని చెప్పారు. 2020 చాలా అద్భుతంగా ఉంటుందన్నారు. పంటలు బాగున్నాయి.. నీళ్లు ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు బాగుంటాయని ఆకాంక్షించారు.