గుంటూరు : దేశవ్యాప్తంగా ఐఐఎం, ఐఐటీల్లో ఎంబీఏ ప్రవేశానికి గానూ ప్రతి ఏటా నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) పరీక్షలో ఈ ఏడాది గుంటూరులో శిక్షణ పొందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. వివిధ శిక్షణ కేంద్రాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని వారు ఎంచుకున్న రంగంలో రాణించాలనే పట్టుదలతో కృషి చేశారు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఈ పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేశారు. చక్కని ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులు ‘న్యూస్‌టుడే’తో ఆదివారం మాట్లాడారు.
ఇతర విద్యార్థుల ఫలితాలు
ఈ ఏడాది క్యాట్ పరీక్షకు గుంటూరులో శిక్షణ తీసుకుని పరీక్షకు హాజరైన మరికొందరు విద్యార్థులు హర్షవరుణ్-98.66, ఎన్.నవ్య-98.22, కె.సందీప్-98.10, ఎంఆర్‌వీఎస్ రేవంత్-98.09, లీలా సిరి-97.58, ఎం.సుబ్రహ్మణ్యం-97.25 పర్సంటైల్‌ను సాధించారు.
మేనేజ్‌మెంట్ కోర్సులకు విశిష్ట ఆదరణ
మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రస్తుతం ఉపాధి అవకాశాలు బాగున్నాయి. నేను కూడా ఈ రంగంలో స్థిరపడాలని కృషి చేశాను. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఏడాది పాటు శిక్షణ తీసుకున్నా. గతేడాది ప్రయత్నించినా మంచి ఫలితాలు రాకపోవడంతో ఈసారి తిరిగి పరీక్షకు సన్నద్ధమయ్యాను. నాకు 99.18 పర్సంటైల్ వచ్చింది.
ముందస్తు పరీక్షలు ప్రయోజనకరం
ఏటా 2 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు. కేవలం 3 గంటల సమయంలో మూడు అంశాలకు జవాబు చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ కావడంతో ఒకింత ఉత్కంఠకు లోనవుతాం. దీనిని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు విధిగా ముందస్తు పరీక్షలతో సాధన చేయాలి. బోధన సమయంలో ప్రత్యేకంగా రాతపుస్తకాన్ని ఏర్పరుచుకుని స్వీయ పర్యవేక్షణ చేసుకోవాలి. ఈ పరీక్షలో 98.86 పర్సంటైల్ సాధించాను.
పటిష్ఠ ప్రణాళికతో విజయం
దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష కావడంతో పోటీతత్వం అధికంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా పటిష్ఠ ప్రణాళికను అనుసరిస్తే విజయం సాధించవచ్చు. ప్రసిద్ధి చెందిన ఐఐఎంల్లో ప్రవేశం సాధిస్తే.. ఎంబీఏ తదనంతరం మెరుగైన ఉపాధి లభించేందుకు వీలుంటుంది. శిక్షణ కేంద్రాల్లో అందించే బోధనలు చక్కని ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుంది. క్యాట్ ప్రవేశ పరీక్షలో 99.94 పర్సంటైల్‌ను సాధించడం సంతోషంగా ఉంది.
నాన్న కష్టానికి ఫలితం
చిన్నతనం నుంచి నాన్న ఆటో నడుపుతూ నన్ను చదివించారు. క్యాట్ ఫలితాల్లో 99.12 పర్సంటైల్ వచ్చింది. నాన్న కష్టానికి ఫలితం దక్కిందనుకుంటున్నా. ఎంబీఏ కోర్సును పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో మేనేజర్‌గా పని చేసేందుకు కృషి చేస్తాను.